ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రేపు(సోమవారం) హైదరాబాద్ లో పర్యటించనున్నారు. శంషాబాద్ ముచ్చింతల్ శ్రీరామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో సీఎం పాల్గొనున్నారు. సోమవారం మధ్యాహ్నం 3.50 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి సీఎం జగన్ బయలుదేరనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు శంషాబాద్ చేరుకుని అక్కడ నుంచి చినజీయర్ స్వామి ఆశ్రమానికి చేరుకోనున్నారు. చినజీయర్ స్వామి ఆశ్రమంలో శ్రీ రామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో సీఎం జగన్ పాల్గొంటారు. ఈ కార్యక్రమం అనంతరం తిరిగి సాయంత్రం 9.05 గంటలకు తాడేపల్లి చేరుకోనున్నారు.
సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొన్న పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం సాయంత్రం ముచ్చింతల్‌లోని రామానుజ సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొన్నారు. సమతామూర్తి కేంద్రాన్ని పవన్ కల్యాణ్ సందర్శించారు. ఆశ్రమంలోని విశేషాలను అడిగి తెలుసుకున్నారు. విగ్రహం చుట్టూ ఉన్న 108 దివ్య దేశాల ఆలయాలను దర్శించుకున్నారు. అనంతరం ప్రవచన మండపంలో చినజీయర్ స్వామిని కలిసి వేద ఆశీర్వచనాలు పొందారు. ముచ్చింతల్‌లో పవన్ కల్యాణ్ చూసేందుకు అభిమానులు, భక్తులు పోటీ పడ్డారు.
216 అడుగుల విగ్రహం
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ సమీపంలో శ్రీరామనగరంలో శ్రీమద్రామానుజాచార్య సమతామూర్తి స్ఫూర్తి కేంద్ర నిర్మాణాన్ని 2014లో ప్రారంభించారు. 45 ఎకరాల విస్తీర్ణంలో ఎన్నాళ్లైనా చెక్కుచెదరని రీతిలో విగ్రహాన్ని రూపుదిద్దారు. విగ్రహ పీఠంతో సహా మొత్తం ఎత్తు 216 అడుగుల రామానుజుని విగ్రహం ఏర్పాటుచేశారు. అయితే రామానుజుని విగ్రహం ఎత్తు 108 అడుగులు కాగా పద్మపీఠం 27, భద్రవేదిక 54, త్రిదండం 135 అడుగుల ఎత్తులో ఉంటాయి. విగ్రహం చుట్టుకొలత 108 అడుగులుగా ఉంది. కూర్చుని ఉన్న విగ్రహాల్లో ప్రపంచంలోనే రెండో పెద్ద విగ్రహంగా నిలవనుంది రామానుజుని ప్రతిమ. మొత్తం 1800 టన్నుల పంచలోహాలతో చైనాలో తయారు చేసిన ఈ విగ్రహాన్ని పలు భాగాలుగా హైదరాబాద్ కు తరలించారు. చైనా నిపుణులే వచ్చి వీటిని విగ్రహంగా మలచారు. రూ. వెయ్యి కోట్ల అంచనాతో ఆశ్రమాన్ని నిర్మించారు.