తెలంగాణ సీఎం కేసీఆర్ రేపు(సోమవారం) ఉదయం యాదాద్రిలో పర్యటించనున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులను సీఎం పరిశీలించనున్నారు. మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించాలని గతంలోనే నిర్ణయించారు. దీంతో అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తుంది. యాదాద్రి కొండపైన, కొండ కింద అభివృద్ధి పనులు ఇప్పటికే దాదాపుగా పూర్తయ్యాయి. మార్చి 21వ తేదీ నుంచి మహాసుదర్శనయాగం నిర్వహించనున్నారు. ఈ యాగం కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ పనులను సీఎం కేసీఆర్ స్వయంగా పరిశీలించనున్నారు.
11న జనగామలో సీఎం కేసీఆర్ టూర్
ఈ నెల 11న సీఎం కేసీఆర్ జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. జనగామ జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన టీఆర్‌ఎస్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు. శనివారం జనగామలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు కలెక్టర్ శివలింగయ్య ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. హనుమకొండ రోడ్డులో కొత్త కార్యాలయం వద్ద బహిరంగ సభ స్థలాన్ని కూడా మంత్రి పరిశీలించారు. బహిరంగ సభకు జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల నుంచి దాదాపు 50 వేల మందికిపైగా జనాన్ని సేకరించాలని భావిస్తు్న్నారు. 12వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లా టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
యాదాద్రి ఆలయం ప్రత్యేకతలు
యాదాద్రిగా పేరొందిన యాదగిరిగుట్టలోని ప్రధాన ఆలయం మార్చి నెలల్లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. కృష్ణశిలతో నిర్మించిన ఈ ఆలయాన్ని మార్చిలో ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. పూర్తిస్థాయిలో రూపుదిద్దుకున్న అనంతరం యాదాద్రి ఆలయంలో దేశంలోనే అత్యంత ఖరీదైన ఆలయాల్లో ఒకటిగా నిలవనుంది. యాదగిరిగుట్ట కొండపై 14 ఎకరాల్లో శతాబ్దాల క్రితం నిర్మించిన ఆలయాన్ని పునర్ నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు దాదాపు రూ.1000 కోట్లు ఖర్చు చేసింది. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు చేపడుతున్న యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ, ఆలయం పక్కన ఉన్న పెద్ద గుట్టపై 850 ఎకరాల్లో ఆలయ నగరిని అభివృద్ధి చేసింది. ఇందులో 250 ఎకరాలను దాతల సహకారంతో వసతి గృహాలు నిర్మించారు. మిగిలిన 600 ఎకరాల్లో మూడు హెలిప్యాడ్లు, కల్యాణ కట్ట, విలాసవంతమైన కాటేజీలు, ఫుడ్ కోర్టులు, బస్ టెర్మినల్, ఇతర సదుపాయాలు ఏర్పాటుచేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో గంటకు 15 వేల లడ్డూలు తయారు చేసే ఆధునిక లడ్డూ తయారీ మెషీన్, 500 మంది భక్తులు తలనీలాలు సమర్పించే వెసులుబాటు కలిగిన కళ్యాణకట్టను నిర్మిస్తున్నారు. ఆలయ ప్రాంగణానికి సమీపంలో 13.25 ఎకరాల్లో ప్రెసిడెన్షియల్ విల్లా, 14 వీవీఐపీ కాటేజీలు, 1500 మంది భక్తులకు అన్నప్రసాదం అందజేయగలిగే సామర్థ్యం కలిగిన రెండు పెద్ద డైనింగ్ హాల్స్ ఏర్పాటు చేస్తున్నారు.