ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల మేనిఫెస్టో విడుదల కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ వాయిదా వేసింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కన్నుమూసిన కారణంగా ఈరోజు జరగాల్సిన అన్ని కార్యక్రమాలను రద్దు చేసినట్లు ప్రకటించింది. 







ఈరోజే..


ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల కోసం ఆదివారం ఉదయం 10.15 గంటలకు మేనిఫెస్టోను విడుదల చేయాలని భాజపా నిశ్చయించుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఇందుకోసం.. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అయితే లతా మంగేష్కర్ మృతి నేపథ్యంలో విడుదలను నిలిపివేస్తున్నట్లు ఉత్తర్​ప్రదేశ్ భాజపా అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ ప్రకటించారు. మేనిఫెస్టో విడుదల తేదీని త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా గాయని ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.


మేనిఫెస్టోలో..


భాజపా విడుదల చేయనున్న మేనిఫెస్టోలో కీలక హామీలు ఉన్నట్లు సమాచారం. 



  • పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ఇస్తోన్న ఆర్థిక సాయం డబుల్ చేయనున్నారు.

  • విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు.. కళాశాలకు వెళ్లే విద్యార్థినులు, ఉద్యోగం చేసే మహిళలకు స్కూటీలు పంపిణీ.

  • ప్రధాన మంత్రి ఉజ్వల పథకం కింద మహిళలకు ఏడాదికి మూడు ఎల్‌పీజీ సిలిండర్లు ఉచితంగా పంపిణీ.


మోదీ ర్యాలీ రద్దు..


 గోవాలో ప్రధాని వర్చువల్ ప్రచారం కూడా రద్దు చేశారు. మోదీ ర్యాలీతో పాటు ఇతర కార్యక్రమాలను కూడా నిలిపివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రకటించారు. లతా మంగేష్కర్ మరణించిన నేపథ్యంలో రాష్ట్రంలో రెండు రోజుల పాటు సంతాప దినాలను పాటించనున్నట్లు తెలిపారు. 


కరోనా బారినపడి కోలుకున్న లతా మంగేష్కర్.. ముంబయిలోని బ్రీచ్​ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 


Also Read: Asaduddin Owaisi Attack: 'మీరు ఒక్క ఓవైసీని చంపితే లక్షలాది మంది ఓవైసీలు పుడతారు'