దేశానికి నేడు ప్రధాన లేరంటూ కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  తాను ఏం చేసినా ప్రజలు మౌనంగా ఉండాలని నమ్మే రాజు పాలనలో ఉన్నామంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. 


ఉత్తరాఖండ్‌లోని కిచ్చాలో 'ఉత్తరాఖండ్‌ కిసాన్ స్వాభిమాన్ సంవాద్' పేరుతో కాంగ్రెస్ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో కాంగ్రెస్‌ ప్రధానకార్యదర్శి రాహుల్ గాంధీ, ఆ పార్టీ లీడర్లు తీవ్ర స్థాయిలో ప్రధానిపై విరుచుకుపడ్డారు. వయనాడ్ ఎంపీ మాట్లాడుతూ కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తున్న టైంలో రైతులను ఒక సంవత్సరం పాటు రోడ్లపై ప్రధాని మోదీ వదిలేశారని దుయ్యబట్టారు. అలాంటి వాటిని కాంగ్రెస్ ఎప్పుడూ చేయదన్నారు. 


రైతులు, కూలీలు, పేదలకు తమ పార్టీ ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటుందన్నారు రాహగుల్ గాంధీ. వారితో భాగస్వామ్యం కావాలని చూస్తుందన్నారు. 


"అందరి కోసం పని చేయని వ్యక్తి ప్రధాని కాలేడు. ఆ లెక్క ప్రకారం నరేంద్ర మోదీ కూడా ప్రధాని కారు." అని రాహుల్ గాంధీ అన్నట్టు పిటిఐ ఉటంకించింది. 






"ఇవాళ దేశానికి ప్రధానమంత్రి లేరు. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అందరూ మౌనంగా ఉండాలని నమ్మే రాజు ఉన్నారు." అంటూ సీరియస్ కామెంట్స్‌ చేశారు రాహుల్. 


కేంద్రం చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది పొడవునా రైతుల నిరసన చేపట్టారు. కానీ ప్రధాని మోదీ వాళ్లను పట్టించుకోలేదు. కరోనా టైంలో వాళ్లను రోడ్లపైనే వదిలేశారని మండిపడ్డారు రాహుల్. 


మోడీ ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహరించిన విధంగా తమ పార్టీ ఎప్పటికీ వ్యవహరించదని రాహుల్ నొక్కి చెప్పారు: “కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైతుల కోసం తలుపులు ఎప్పుడూ మూసివేయదు. రైతులు, పేదలు, కార్మికుల భాగస్వామ్యంతో పని చేయాలనుకున్నాము. ఇది తమ ప్రభుత్వమని వాళ్లంతా భావించేలా పని చేశాం."


కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలన వెనక్కి తీసుకునేలా రాత్రిపగలు పోరాడిన రైతులను రాహుల్ గాంధి అభినందించారు. 


ఇప్పుడు మనం రెండు భారత్‌లు చూస్తున్నామని లోక్‌సభలో చేసిన కామెంట్స్‌కు కట్టుబడి ఉన్నట్టు రాహుల్ స్పష్టం చేశారు. మరోసారి ఆ కామెంట్స్ చేశారు. ఇవాళ రెండు భారతదేశాలు ఉన్నాయని, ఒకటి ధనికులకు,  మరొకటి పేదవాళ్లకని అన్నారు. 


"సుమారు దేశంలోని నలభై శాతం ప్రజలకు సమానమైన సంపద దేశంలోని సుమారు 100 మంది వ్యక్తుల వద్ద ఉంది. ఇంతటి ఆదాయ అసమానత మరెక్కడా కనిపించదు" అని రాహుల్ అన్నారు.


పారిశ్రామికవేత్తలు బ్రిటిష్ వారితో పోరాడలేదు కానీ దేశంలోని రైతులు, కార్మికులతో పారాడుతున్నారని విమర్శించారు రాహుల్. 


లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ ఈ 'రెండు భారతదేశాలు' అనే వ్యాఖ్య చేశారు.


70 స్థానాలున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 14న పోలింగ్ జరగనుంది.