తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన మంత్రి పర్యటనకు హాజరు కావడం చర్చనీయాంశమైంది. ఇదే అదనుగా చేసుకొని బీజేపీ విమర్శలు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. తాజాగా మరోసారి ప్రోటోకాల్ పాటించకుండా తప్పు చేశారని తెలంగాణ బీజేపీ శనివారం ట్వీట్ చేసింది. కేసీఆర్ ప్రధాని పర్యటనకు హాజరు కాకపోవడాన్ని మూర్ఖమైన, అవమానకరమైన చర్యగా అభివర్ణించింది.






అయితే, బీజేపీ విమర్శకు దీటుగా టీఆర్ఎస్ పార్టీ ట్విటర్ వేదికగానే గట్టి కౌంటర్ ఇచ్చింది. ప్రధాన మంత్రి తాజా పర్యటన ప్రైవేటు పర్యటన అని, దానికి సీఎం హాజరు కానవసరం లేదని వివరించింది. భారత ప్రభుత్వంలోని హోంమంత్రిత్వశాఖ జారీ చేసిన ప్రోటోకాల్ ప్రకారం ప్రధాని ప్రైవేటు పర్యటన అయితే సీఎం హాజరుఅవ్వక్కర్లేదని స్పష్టం చేసింది. అధికారిక పర్యటన అయితే ప్రోటోకాల్ ప్రకారం సీఎం హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొంది. ఇందుకు సంబంధించి ప్రోటోకాల్ నిబంధనల కాపీని కూడా ట్వీట్ చేసింది. ఇలాంటి చీప్ ట్రిక్స్, తప్పుదోవ పట్టించే పనులు బీజేపీ మానుకోవాలని హితవు పలికింది.






ట్రెండింగ్‌లో ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ
మరోవైపు, స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ విగ్రహ ఆవిష్కరణ కోసం హైదరాబాద్ వచ్చిన ప్రధానిని నెటిజన్లు విపరీతంగా ప్రశ్నించారు. ‘ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ’ అంటూ ప్రశ్నించారు. దీంతో ‘ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ’ అనే హాష్ ట్యాగ్ ట్విటర్‌లో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో ట్రెండ్ అయింది. సుమారు 20 వేలకు పైగా ట్వీట్లు ‘ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ’ హాష్ ట్యాగ్ తో ట్విటర్ లో ట్రెండ్ అయింది. తెలంగాణకు చెందిన నెటిజన్లు, టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు ట్విటర్ వేదికగా తెలంగాణకు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించారు. 


ఈ సందర్భంగా వివిధ రంగాల్లో తెలంగాణపైన కేంద్ర ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యాన్ని, వివక్షను తమ ట్విట్లలో ఎండగట్టారు. ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కేటాయించిన నిధులపై ప్రశ్నించారు. ‘‘స్టాచ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ ఆవిష్కరణ కోసం ప్రధాని మోదీ హైదరాబాద్‌కు వచ్చారు. మరి, రాష్ట్రాలకు న్యాయం చేయడంలో ఈ ఈక్వాలిటీ ఏది?’’ అని నెటిజన్లు ప్రశ్నలు సంధించారు. వివిధ రంగాల్లో తెలంగాణ పైన కేంద్ర ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యాన్ని, వివక్షను తమ ట్వీట్లతో ప్రశ్నించారు.