ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా తీవ్రమైన విమర్శలు చేసే తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్‌పై మరో ఫిర్యాదు నమోదైంది. టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా విభాగం కన్వీనర్‌ మన్నె క్రిషాంక్‌ తీన్మార్ మల్లన్నపై సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం సైబర్‌ క్రైమ్ కార్యాలయానికి వచ్చిన క్రిషాంక్‌ పలువురిపై ఫిర్యాదు చేశారు. తీన్మార్ మల్లన్నతో పాటు జగన్‌ పటిమీది, వై.సతీ‌ష్‌రెడ్డి, దినేష్‌ చౌదరి తదితరులపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వీరు ఫిర్యాదు పత్రాన్ని ఏసీపీకి అందజేశారు.


నవీన్‌ కుమార్‌ అలియాస్ తీన్మార్ మల్లన్న ఉద్దేశపూర్వకంగా సీఎం కేసీఆర్‌ను పరుష పదజాలంతో దూషిస్తున్నాడని క్రిషాంక్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా, ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసే విధంగా తీన్మార్ మల్లన్న సొంత ఛానెల్ అయిన క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానెల్‌లో కథనాలు ప్రసారం చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికే క్యూ న్యూస్‌ యూట్యూబ్‌ ఛానెల్‌ వాడుకుంటున్నాడని అన్నారు. తీన్మార్ మల్లన్న చర్యలు నేరపూరితంగా ఉన్నాయని, చట్టప్రకారం కేసులు నమోదు చేసి, శిక్షించాలని క్రిషాంక్ ఏసీపీని కోరారు.


Also Read: TS News: చనిపోయిందనుకొని అంత్యక్రియలు చేశారు.. 11 ఏళ్లకు తిరిగొచ్చింది..


అనంతరం క్రిషాంక్ మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో తీన్మార్‌ మల్లన్న తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఆయన తన తీరును మార్చుకోకపోతే క్యూ న్యూస్ కార్యాలయంపై ప్రత్యక్ష దాడులకు సైతం దిగుతామని వారు హెచ్చరించారు. తనపై నమోదైన కేసుల నుండి తప్పించుకునేందుకు, ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు తీన్మార్ మల్లన్న ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని క్రిషాంక్ ఫిర్యాదులో పేర్కొన్నారు.


కేసీఆర్ ప్రభుత్వంపై సామాన్యుడి స్వరంతో ప్రశ్నిస్తున్నాంటూ తీన్మార్ మల్లన్న సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సీఎం సహా టీఆర్ఎస్ నేతలందరిపై తనదైన శైలిలో తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. గతంలోనూ తనపై కొన్ని కేసులు నమోదయ్యాయి. అయితే, వాటి విచారణ సందర్భంగా తీన్మార్ మల్లన్న గతంలో మండిపడ్డారు. విచారణ పేరుతో తనను పిలిపించి ఉదయం నుంచి సాయంత్రం వరకూ కూర్చోబెట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై పెట్టిన కేసులేంటని.. అలాంటి కేసుల విచారణకి ఏసీపీ స్థాయి అధికారులు కూర్చుని విచారణ చేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రతి పోలీస్ స్టేషన్‌లో నమోదయ్యే అన్ని కేసుల్లోనూ ఇలాగే ఏసీపీలతో విచారణ చేస్తున్నారా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు.


Also Read: Dead Body In Freezer: 24 రోజులుగా ఫ్రిజ్‌లోనే మృతదేహం.. నిజాలు నిగ్గుతేలాలి.. విలవిల్లాడుతున్న బాధితుడు