మానసిక స్థితి సరిగా లేని మహిళ ఇంట్లో నుంచి తప్పిపోయింది. చాలా చోట్ల వెతికారు. జాడ తెలియరాలేదు. అలా 11 ఏళ్లు గడిచిపోయాయి. ఒక రోజు సడెన్ గా అడవిలో కుళ్లిపోయిన స్థితిలో మహిళ శవం దొరికింది. అది ఆమెదే అనుకుని కుటుంబ సభ్యులు అంత్యక్రియలు కూడా నిర్వహించారు. కొద్ది రోజుల క్రితం ఆమె తమిళనాడులోని ఓ స్వచ్ఛంద సంస్థలో ఉందని సమాచారం అందింది. కుటుంబ సభ్యులు వెళ్లి ఆమెను ఇంటికి తీసుకొచ్చారు.
ఈ ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రెంజర్ల లక్ష్మి (48), నర్సయ్య భార్యాభర్తలు. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నాయి. నర్సయ్య గల్ఫ్‌లో ఉంటాడు. లక్ష్మికి మాససిక స్థితి సరిగా ఉండదు. 11 ఏళ్ల క్రితం ఆమె కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు చాలా చోట్ల వెతికారు. అయినా జాడ తెలియరాలేదు. రెండేళ్ల తర్వాత నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలం కోనాపూర్ అటవీ ప్రాంతంలో ఒక మహిళ మృతదేహం దొరికింది. ఇది పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో గుర్తుపట్టలేని తీరుగా ఉంది. శవానికి ఉన్న దుస్తులను బట్టి అవి లక్ష్మివేనని కుటుంబ సభ్యులు భావించారు. అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు.
ఇంటి నుంచి వెళ్లిపోయిన లక్ష్మి తమిళనాడులోని పెరంబలూర్‌కి చేరుకుంది. అక్కడున్న ఓ స్వచ్ఛంద సంస్థ లక్ష్మిని చేరదీసింది. ఆమెకు చికిత్స చేయించడంలో కోలుకుని సాధారణ స్థితికి వచ్చింది. సంస్థ ప్రతినిధులు వివరాలు అడగ్గా.. లక్ష్మి వెల్లడించింది. దీంతో వారు లక్ష్మి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు పెరంబలూర్ వెళ్లి లక్ష్మిని ఇంటికి తీసుకొచ్చారు. చనిపోయిందనుకున్న లక్ష్మి ఇంటికి తిరగి రావడంతో భర్త, కుమార్తెలు, బంధువులు సంతోషం వ్యక్తం చేశారు.
గతంలోనూ ఇలాంటి ఘటనలు..
పైన చెప్పిన తీరుగానే ఏపీలోని కృష్ణా జిల్లాలో 2 నెలల క్రితం ఒక ఘటన జరిగింది. జగ్గయ్యపేటలోని క్రిస్టియన్ పేటకు చెందిన ముత్యాల గిరిజమ్మ (75)కు కోవిడ్ సోకడంతో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ఆ తర్వాత 3 రోజులకు ఆమె భర్త ఆస్పత్రికి వెళ్లగా గిరిజమ్మ కనిపించలేదు. ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించగా వేరే వార్డుకు మార్చారేమోనని సమాధానం చెప్పారు. ఆస్పత్రి అంతా వెతికినా ఎక్కడా ఆమె జాడ తెలియరాలేదు. ఆస్పత్రి సిబ్బందిని ప్రశ్నిస్తే.. మార్చురీలో ఉందేమో చూడమని చెప్పారు. భార్యను పోలిన శవాన్ని చూసి అది గిరిజమ్మేనని భర్త అనుకున్నాడు. అంత్యక్రియలు జరిపించి పెద్ద కర్మ కూడా చేశాడు.
చికిత్స అనంతరం కోవిడ్ నెగిటివ్ రావడంతో గిరిజమ్మను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. గిరిజమ్మ చనిపోయిందని అంత్యక్రియలు కూడా నిర్వహించాక... ఆమె ఆటో దిగి ఇంటికి రావడం చూసి ఆశ్చర్యపోయారు.