Chandrababu About Gaddar:  ప్రజా యుద్ధనౌక గద్దర్ కు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నివాళి అర్పించారు. హైదరాబాద్ ఆల్వాల్ లోని గద్దర్ నివాసానికి చంద్రబాబు మంగళవారం ఉదయం వెళ్లారు. ప్రజా గాయకుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన చంద్రబాబు.. గద్దర్ సమాధి దగ్గర నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడిన చంద్రబాబు.. గద్దర్, తానూ అనేక పోరాటాల్లో కలిసి పాల్గొన్నామని చెప్పారు. పీడిత ప్రజల సంక్షేమం కోసం గద్దర్ అనేక పోరాటాలు చేశారన్న ఆయన.. తాను కూడా బీసీల కోసం, ఎస్సీ, ఎస్టీల కోసం గద్దర్ తో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నట్లు చంద్రబాబు గుర్తు చేశారు.


కాల్పుల ఘటనపై అవన్నీ అపోహలేనన్న చంద్రబాబు 
1997 ఏడాదిలో గద్దర్ పై జరిగిన కాల్పుల ఘటనపైనా చంద్రబాబు మాట్లాడారు. ఆ ఘటనపై గద్దర్ చాలా సార్లు తనతో మాట్లాడారని అనడం కేవలం అపోహ మాత్రమే అని తేల్చి చెప్పారు. అదంతా కొంత మంది కల్పించిన అపోహ మాత్రమే అని అన్నారు. అప్పట్లో ప్రజా యుద్ధనౌక గద్దర్ పై జరిగిన కాల్పుల ఘటనను తాను తీవ్రంగా ఖండించినట్లు గుర్తు చేశారు. 


'పేదవాళ్ల సమస్యలు, హక్కులపై గద్దర్ గళమెత్తారు. పేదల హక్కులపై గద్దర్ రాజీలేని పోరాటం చేశారు. భయమంటే తెలియని వ్యక్తి.. దేనికీ భయపడరు. గద్దర్ చనిపోయినా.. ఆయన స్ఫూర్తి శాశ్వతం. సమాజహితం కోసం పనిచేసిన వ్యక్తిని కోల్పోయాం. పౌర హక్కుల ఉద్యమాల్లో గద్దర్ పాత్ర మరవలేనిది. ప్రశ్నించే స్వరం మూగబోయింది. ప్రజా చైతన్యంలో మొదట గుర్తొచ్చేది గద్దర్. ప్రజా ఉద్యమాలకు గద్దర్ ఊపిరిపోశారు. తెలంగాణ ఉద్యమంలోనూ గద్దర్ ది కీలక పాత్ర పోషించారు. గద్దర్ చనిపోయినా ఆయన స్ఫూర్తి ఎప్పటికీ నిలిచి ఉంటుంది. గద్దర్ ఒక వ్యక్తి కాదు.. ఆయనొక వ్యవస్థ. గద్దర్ స్ఫూర్తిని భావితరాలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. గద్దర్ ఆశయాలను కొనసాగించేలా మా కార్యాచరణ ఉంటుంది' అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. 


బెల్లి లలిత సహా ఎంతో మంది ప్రజా ఉద్యమ నాయకులను రాష్ట్ర ప్రభుత్వం బూటకపు ఎన్ కౌంటర్లు చేస్తోందని గద్దర్ ఉద్యమించారు. 1997లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం బూటకపు ఎన్ కౌంటర్లు చేస్తోందని ఆరోపిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబునాయుడికి వ్యతిరేకంగా గద్దర్ 1997 ఏప్రిల్ 6వ తేదీన హైదరాబాద్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున జనసమీకరణ కావడంతో పోలీసులు నిరసనల్ని అణిచివేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో కొంత మంది (పోలీసులే కాల్పులు జరిపారని కొందరు అంటారు, గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని మరికొంత మంది అంటారు) గద్దర్ పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. 


ఈ కాల్పులలో గద్దర్ శరీరంలోకి తుపాకీ తుటాలు దూసుకెళ్లాయి. వెంటనే గద్దర్ ను ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు శరీరంలోని అన్ని బుల్లెట్లు తొలగించారు. కానీ ఒక బుల్లెట్ ను అలాగే ఉంచేశారు. ఆ వెన్నెముకలో ఇరుక్కున్న ఆ బుల్లెట్ ను తొలగిస్తే గద్దర్ ప్రాణానికే ప్రమాదమని భావించి ఆ బుల్లెట్ ను అలాగే ఉంచేశారు. ఒంట్లో బుల్లెట్ ఉంచుకునే గద్దర్ తన పోరాటం సాగించారు. తన పాటతో సుదీర్ఘకాలం పోరు సాగించారు. ఆ బుల్లెట్ గద్దర్ శరీరంలో 25 సంవత్సరాలకు పైగా ఉంది. ఆయన తుదిశ్వాస విడిచే వరకు ఒంట్లో బుల్లెట్ అలాగే ఉంది. గద్దర్ పై కాల్పుల కేసు ఇప్పటికీ మిస్టరీయే. గద్దర్ ను చంపాలనుకున్నది ఎవరు, ఆరోజు కాల్పులు జరిపింది ఎవరో ఇప్పటికీ తేలలేదు. 


Also Read: Mallikarjun Kharge: ఎర్రకోట వేడుకకు మల్లికార్జున్ ఖర్గే గైర్హాజరు, ఖాళీ కుర్చీల ఫొటోలు పోస్టు చేసిన కాంగ్రెస్


ఆగస్టు 6వ తేదీన ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూశారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గద్దర్ తుదిశ్వాస విడిచారు. 1949లో తూప్రాన్ లో గద్దర్ జన్మించారు. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ప్రజల్లో చైతన్యం కల్పించడంలో గద్దర్ ఎంతో కీలకపాత్ర పోషించారు. తన పాటలతో ఉద్యమాలకు ఊపు తెచ్చిన ఘనత గద్దర్ దే. 1987లో కారంచేడులో దళితుల హత్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. 74 ఏళ్ల వయసులో అనారోగ్యానికి చికిత్స పొందుతూ కన్నుమూశారు.