Mallikarjun Kharge: స్వాతంత్ర్య దినోత్సవం వేళ ఎర్రకోట వద్ద వేడుకలు ఘనంగా జరిగాయి. ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి ప్రధాని మోదీ దేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడైన మల్లికార్జున్ ఖర్గే ఈ వేడుకలకు హాజరు కాలేదు. ఆయన కోసం వేసిన కుర్చీ ఖాళీగా దర్శనమిచ్చింది. ఓ వీడియో మెసేజ్ ను సోషల్ మీడియాలో పోస్టు  చేసిన ఖర్గే.. గత ప్రధానులు దేశాన్ని తీర్చిదిద్దిన వైనాన్ని వెల్లడించారు.


ఆరోగ్యం బాలేకపోవడంతో ఎర్రకోటలో జరిగిన వేడుకలకు హాజరు కాలేకపోయినట్లు చెప్పిన ఖర్గే.. తమ వీడియో సందేశంలో స్వాతంత్ర్య సమరయోధులకు నివాళి అర్పించారు. మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, నేతాజీ, మౌలానా ఆజాద్, రాజేంద్ర ప్రసాద్, సరోజిని నాయుడు, అంబేద్కర్ కు నివాళి అర్పించారు. అలాగే దేశ తొలి ప్రధాని నెహ్రూ, ఇతర కాంగ్రెస్ నేతలు ఇందిరా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ అలాగే బీజేపీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయిల పాత్రను ఖర్గే తన వీడియో సందేశంలో కొనియాడారు. దేశానికి సేవ చేసిన ప్రతి ప్రధాన మంత్రి దేశ ప్రగతికి దోహదపడ్డారని, గత కొన్నేళ్లలో భారత్ పురోగమిసుందని ఈ రోజు కొందరు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని మోదీపై పరోక్షంగా ఖర్గే విమర్శలు గుప్పించారు. 


వాజ్ పేయి సహా ఇతర ప్రధాన మంత్రులు అందరూ దేశం కోసం ఎంతో కృషి చేశారని, దేశాభివృద్ధికి అనేక కార్యక్రమాలు అమలు చేశారని చెప్పారు. ప్రస్తుతం మాత్రం ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, స్వయంప్రతిపత్తి సంస్థలు తీవ్రమైన ముప్పులో ఉన్నాయని బాధగా చెబుతున్నట్లు ఖర్గే తన సందేశంలో వెల్లడించారు. ప్రశ్నించే గొంతుకలను అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీ అధికారులతో దాడులు చేయించడమే కాకుండా, ఎన్నికల కమిషన్ ను కూడా నిర్వీర్యం చేస్తున్నారని చెప్పారు. ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేస్తున్నారని అన్నారు. మైక్ లు కట్ చేస్తున్నారని, ప్రసంగాలు తొలగిస్తున్నారని మండిపడ్డారు. 


Also Read: Women Freedom Struggle: స్వాతంత్య్ర పోరాటంలో తెగించి కొట్లాడిన ధీర వనితలు, ఒక్కొక్కరి జీవితం స్ఫూర్తిదాయకం


ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం), ఎయిమ్స్, అంతరిక్ష పరిశోధనల సంస్థ (ఇస్రో) వంటివి నెహ్రూ హయాంలోనే జరిగాయని చెప్పుకొచ్చారు. స్వతంత్ర భారత్ లో కళ, సంస్కృతి, సాహిత్యాన్ని ప్రోత్సహించారని ఖర్గే అన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ విధానాలు ప్రధాని మోదీ కీలక మంత్రాల్లో ఒకటైన ఆత్మనిర్భర్ భారత్ గా మారడానికి దోహదపడ్డాయని మల్లికార్జున్ ఖర్గే అన్నారు. మహానాయకులు కొత్త చరిత్ర సృష్టించడానికి గత చరిత్రను చెరిపివేయరని, వీళ్లు మాత్రం ప్రతిదాన్ని పేరు మార్చాలని ప్రయత్నిస్తున్నారని ఖర్గే అన్నారు. గత పథకాలు, తమ నియంతృత్వ మార్గాలతో ప్రజాస్వామ్యాన్ని చీల్చుతున్నారని ఆరోపించారు. 


ఇలా స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఇలా ప్రధానమంత్రిపై విమర్శలు చేయడం చాలా అరుదు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడి చేయకుండా ఉండటం ఇప్పటి వరకు ఒక సంప్రదాయంగా వస్తోంది. అయితే ఖర్గే ఆ సంప్రదాయాన్ని పటాపంచలు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధాన మంత్రిని పరోక్షంగా విమర్శించారు.