Independence Day 2023: దేశ వ్యాప్తంగా 77వ స్వాతంత్ర్యదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 10వ సారి ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ముందుగా రాజ్‌ఘాట్ వద్ద జాతీపిత మహాత్మాగాంధీకి ప్రధాని నివాళులర్పించారు. అనంతరం జెండా ఆవిష్కరించి ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనదని.. దేశం కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారన్నారు.
ఎర్రకోటపై నుంచి జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ మధ్యతరగతి, మహిళల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. రాబోయే సంవత్సరాల్లో దేశంలోని మధ్య తరగతి ప్రజలను ఆర్థికంగా, అన్ని విధాలుగా బలోపేతం చేస్తానని ప్రధాని మోదీ పార్లమెంట్ ఎన్నికల ముందు తన చివరి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో వాగ్దానం చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం ఇప్పుడు ‘విశ్వామిత్ర’గా గుర్తించబడిందని ప్రధాని అన్నారు. క్షురకులు, స్వర్ణకారుల కోసం విశ్వకర్మ యోజనను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. వారి అభివృద్ధి రూ. 13,000-15,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వం ‘వైబ్రెంట్ విలేజెస్’ పథకం ద్వారా సరిహద్దు గ్రామాల రూపు రేఖలు మారుస్తోందని ప్రధాని అన్నారు. సరిహద్దులో ఉన్న గ్రామం భారతదేశానికి చివరి గ్రామం కాదని, ముందు చెప్పినట్లుగా ఇది దేశంలోని మొదటి గ్రామం అని ఆయన అన్నారు.
మహిళ సారధ్యంలో దేశం అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు. నేడు, పౌర విమానయాన రంగంలో అత్యధిక పైలట్‌లను కలిగి ఉన్న దేశం భారత్ అని గర్వంగా చెప్పగలమన్నారు. మహిళా శాస్త్రవేత్తలు చంద్రయాన్ మిషన్‌కు నాయకత్వం వహిస్తున్నారని, మహిళల నేతృత్వంలోని అభివృద్ధిని G20 దేశాలు కూడా గుర్తిస్తున్నాయని అన్నారు.
ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, ప్రజలను శక్తివంతం చేయడం, భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడం తమ లక్ష్యమని ప్రధాన మంత్రి ప్రకటించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ అగ్రగామిగా నిలుస్తుందని ప్రధాని మంత్రి హామీ ఇచ్చారు. పేదరికం తగ్గినప్పుడు మధ్యతరగతి బలం పెరుగుతుందని. రానున్న ఐదేళ్లలో ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థలలో దేశం అగ్రస్థానంలో ఉంటుందన్నారు. పేదరికం నుంచి బయటపడిన 13.5 కోట్ల ప్రజలు మద్య తరగతికి చేరుకుంటారని, వారే దేశ అభివృద్ధికి బలమన్నారు.
మణిపూర్‌లో శాంతి నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎర్రకోటపై నుంచి ప్రధాని మోదీ తెలిపారు. దేశం మొత్తం మణిపూర్ ప్రజలకు అండగా నిలుస్తుందని, శాంతి ద్వారానే పరిష్కారం లభిస్తుందని, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పారు. భారత దేశ జనాభా, ప్రజాస్వామ్యం, వైవిధ్యంఈ మూడు దేశం కలలను సాకారం చేయగలవని అన్నారు.
దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లలో స్వాతంత్ర్య వేడుకలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద 10,000 మంది పోలీసులను మోహరించారు. అలాగే 1,000 ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలు, యాంటీ డ్రోన్ సిస్టమ్‌లను కూడా ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు ప్రత్యేక అతిథులుగా నర్సులు, ఉపాధ్యాయులు, రైతులు, మత్స్యకారులు, సర్పంచ్‌లు వంటి వివిధ వృత్తులకు చెందిన 1800 మందికి పైగా ప్రజలు హాజరయ్యారు. భారతీయ-అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా, కాంగ్రెస్ సభ్యుడు మైఖేల్ వాల్ట్జ్ నేతృత్వంలోని యుఎస్ చట్టసభ సభ్యుల ద్వైపాక్షిక బృందం ఎర్రకోట వేడుకల్లో పాల్గొంటోంది.
77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం ప్రధానమంత్రి ఒక తెల్లటి కుర్తా, చురీదార్‌తో కూడిన బహుళ వర్ణ రాజస్థానీ దుస్తులను ధరించారు. ప్రధాని మోదీ 2014 నుంచి ప్రతి స్వాతంత్ర్య దినోత్సవం రోజున రంగురంగుల తలపాగాలు ధరిస్తున్నారు. స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా హర్ ఘర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా ప్రజలు తమ ఇళ్లలో జాతీయ జెండాను ప్రదర్శించాలని ప్రభుత్వం కోరింది.
ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను ప్రతిబింబిస్తూ ఢిల్లీ అంతటా అనేక సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేశారు. ఆగస్టు 15-20 వరకు MyGov పోర్టల్‌లో ఆన్‌లైన్ సెల్ఫీ పోటీ జరుగనుంది. నేషనల్ వార్ మెమోరియల్, ఇండియా గేట్, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, ప్రగతి మైదాన్, రాజ్ ఘాట్ ప్రదేశాల్లో సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేశారు.