వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి పేరు ఇండియన్ బుక్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. ఆమె చేపట్టిన పాదయాత్రకు గానూ ఈ రికార్డును ఆమె సొంతం చేసుకున్నారు. తెలంగాణలో 3800 కిలోమీటర్ల పాయాత్ర చేసిన మొదటి మహిళగా ఆమె రికార్డు క్రియేట్ చేశారు.
ఈ సందర్భంగా ఆమెను ఇండియన్ బుక్ ఆఫ్ రికార్స్ ప్రతినిధులు కలిసి అభినందనలు తెలుపుతూ అవార్డును అందజేశారు.
స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఈ అవార్డు రావడం పట్ల షర్మిల సంతోషాన్ని వ్యక్తం చేశారు. తన తండ్రి కాలంలో తెలంగాణ ప్రాంతామంతా కూడా బంగారు తెలంగాణలా ఉండేదని ఆమె అన్నారు. ఒకనాడు ఇండియాను తెల్లదొరలు పాలిస్తే..ఈనాడు తెలంగాణని ఓ నల్లదొర పాలిస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు.
ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రాన్ని ఆ నల్లదొర చెర నుంచి విడిపించుకోవాలని ఆమె కోరారు. కేసీఆర్ పాలన పోయిన రోజునే తెలంగాణకు నిజమైన స్వతంత్రం అంటూ ఆమె పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో ఆమె జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె కేసీఆర్ మీద విరుచుకుపడ్డారు.
తెలంగాణలో అధికారంలోకి రాగానే గ్రూప్ 1 ఉద్యోగాలు అన్నాడు. ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు.. ఏ తెలంగాణ వారు ఎవరూ కూడా గ్రూప్ 1 ఉద్యోగాలకి అర్హులు కారా అంటూ ఆమె నిలదీశారు. కేసీఆర్ దీనికి సమాధానం చెప్పాలని ఆమె అన్నారు. బీసీ బంధు అంటూ..దళిత బంధు అంటూ కోతలు కోశాడు..అవన్నీ ఎక్కడ పెట్టాడు.ఒక్క మాటైనా నిలబెట్టుకోవడం చేతనైందా అంటూ కేసీఆర్ మీద విరుచుకుపడ్డారు.
2021 అక్టోబర్ లో వైఎస్ షర్మిల తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేపట్టిన చేవెళ్ల నియోజకవర్గం నుంచే షర్మిల పాదయాత్ర ప్రారంభించారు. ఆమె సుమారు ఏడాదిన్నర పాటు పాదయాత్ర చేశారు. ఆమె పాదయాత్ర చేస్తున్న సమయంలో ఎన్నోసార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పాదయాత్ర సమయంలో కూడా ఆమె తెలంగాణ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. ఒకానొక సమయంలో ఆమెను పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. దాంతో కొన్ని రోజులు ఆమె పాదయాత్రకు బ్రేక్ పడింది.
ఆ సమయంలో ఆమె కోర్టుకు వెళ్లి పాదయాత్ర చేయడానికి అనుమతి తెచ్చుకున్నారు. తెలంగాణలో సుదీర్ఘంగా 3800 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి షర్మిల ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చేరారు.