వాలంటీర్ల వ్యవహరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫుల్ అలర్ట్‌గా వ్యవహరిస్తోంది. వచ్చే ఎన్నికల్లో వాలంటీర్ల పాత్ర కీలకం కానున్న వేళ  పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడస్తోంది..


వాలంటీర్ల పై వైసీపీ ప్రత్యేక దృష్టి...
వాలంటీర్ల వ్యవహరంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్దితుల్లో వెనక్కి తగ్గే ప్రసక్త లేదని స్పష్టం చేస్తోంది. అధికారుల కన్నా ముందు వాలంటీర్లకే అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రభుత్వంలోని పెద్దలు, పార్టీలోని పెద్దలతో సహా వాలంటీర్లపై శ్రద్ద పెడుతున్నారు. వారిపై వచ్చే విమర్శలకు ఎప్పటికప్పుడు చెక్ పెట్టటంతోపాటు, వాటిని తిప్పికొట్టేందుకు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. దీనిపై పార్టీ క్యాడర్‌కు కూడా ఆదేశాలు ఇస్తున్నారు. వాలంటీర్లకు అండగా నిలబడేందుకు పార్టీ నుంచి సంకేతాలు అందుతున్నాయి.


వాలంటీర్లపై వైసీపీ లెక్క ఇదేనా...
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ వాలంటీర్లపైనే అంటూ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వాలంటీర్లతో ఎన్నికల విధులు నిర్వహించకూడదని ఇప్పటికే ఎన్నికల సంఘం నుంచి ప్రత్యేకంగా ఆదేశాలు వచ్చాయి. అయితే వాటిని క్షేత్ర స్థాయిలో పట్టించుకోవటం లేదని విమర్శలు ఉన్నాయి.  వాలంటీర్లతోనే ఓటర్ల జాబితా సవరణలు చేయిస్తున్నారని ఆరోపణలు వస్తున్నా లెక్క చేయటం లేదు. ఎన్నికల సమయానికి రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లతో రాజీనామా చేయించి, వారిని పార్టీకి అవసరసమైన మార్గాల్లో వినియోగించుకునేందుకు ప్లాన్ జరుగుతుందని చర్చ జరుగుతుంది. 


ఎన్నికల సమయం నాటికి పోలింగ్ బూత్‌ల వారీగా, వాలంటీర్ల ద్వారానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకంగా చక్రం తిప్పే అవకాశాలు కనిపిస్తున్నాయని టాక్. ప్రతి ఇంటికి వాలంటీర్ కీలకం అవుతున్న వేళ పోలింగ్ బూత్‌లో వారినే నియమించాలని చూస్తున్నారు. వారితో ప్రజలకు ఉన్న పరిచయాలను అక్కడ పనికి వస్తుందని పార్టీ విజయంపై అది ప్రభావం చూపుతుందని అంటున్నారు. 


వాలంటీర్లకు శాలరీ డబుల్...
ఎన్నికల నాటికి వాలంటీర్లు రాజీనామా చేసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారట. వారికి పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చే కార్యక్రమాలపై కూడా ఫోకస్ పెడుతున్నారు. వాలంటీర్లు రాజీనామా చేసిన తరువాత వారికి పార్టీ తరఫున నెలకు 12వేల రూపాయలు జీతాన్ని ఫిక్స్ చేయించాలని భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 


ఎన్నికల తరువాత మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, వాలంటీర్లకు ఫుల్ పవర్స్ ఇవ్వబోతున్నారని టాక్. అన్ని విధాలుగా అండగా ఉంటామనే భరోసా కూడా కల్పించేలా చేస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ పెట్టుకున్నట్లుగా 175 నియోజకవర్గాల్లో అత్యధిక సీట్లను గెల్చుకోవటం ఖాయమంటున్నారు. ఇందులో వాలంటీర్ సేవలు కీలకం కాబోతున్నట్లు సంకేతాలు పంపతున్నారు. దీంతో వాలంటీర్లకు ఇకపై మరింత డిమాండ్ ఏర్పడే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి.