తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్టుండి అస్వస్థతకు గురికావడంతో వైద్య పరీక్షల కోసం యశోద ఆస్పత్రికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన రెండు రోజులుగా బలహీనంగా నీరసంగా ఉన్నారని, ఎడమ చెయ్యి లాగుతుందని చెప్పారని సీఎం వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవీ రావు వెల్లడించారు. హాస్పిటల్‌లో యాంజియోగ్రామ్ పరీక్ష పూర్తయ్యాక ఆయనకు గుండెలో ఎలాంటి సమస్యలు, బ్లాక్స్ లేవని డాక్టర్లు వెల్లడించారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని చెప్పారు. యాంజియోగ్రామ్‌ పరీక్ష పూర్తిగా నార్మల్ అని తేలినట్లుగా డాక్టర్లు చెప్పారు. అయితే, కేసీఆర్ శుక్రవారం (మార్చి 11) ఉదయం 11 గంటల సమయంలో హాస్పిటల్‌కు వెళ్లగా, మధ్యాహ్నం దాటే వరకూ ఆస్పత్రిలోనే ఉంచుతామని డాక్టర్లు చెప్పారు. ప్రివెంటివ్ చెకప్  కింద మరిన్ని రొటీన్ టెస్టులు కూడా చేస్తామని డాక్టర్ ఎంవీ రావు చెప్పారు. 


ఈ పరీక్షలను బట్టి ఒకవేళ అవసరం అనిపిస్తే హాస్పిటల్‌లో అడ్మిట్ చేసుకుంటామని కూడా ఎంవీ రావు వెల్లడించారు. దాదాపు 20 మంది వేర్వేరు స్పెషలిస్టుల టీమ్ ముఖ్యమంత్రికి మెడికల్ టెస్టులు చేస్తోంది. డాక్టర్ ప్రమోద్ కుమార్ నేత్రుత్వంలో ఈ పరీక్షలు చేశారు. ముఖ్యమంత్రి ఆరోగ్యం గురించి యశోద డాక్టర్లు కాసేపట్లో ప్రెస్ మీట్ ద్వారా గానీ, హెల్త్ బులెటిన్ ద్వారా గానీ మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.


ఫోటోలు చూడండి: In Pics: కేసీఆర్‌కు యశోదలో మెడికల్ టెస్టులు - యాంజియోగ్రామ్ పరీక్ష చేసిన డాక్టర్లు


కాసేపట్లో ప్రగతి భవన్‌కు వెళ్లనున్న కేసీఆర్
ఒకవేళ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అడ్మిట్ చేసుకోవాల్సి వస్తే ముందస్తు జాగ్రత్తగా ఆస్పత్రిలోని 9వ ఫ్లోర్‌లో అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎం అధికారిక భద్రతా సిబ్బంది అని రకాల చెకింగ్‌లు చేశారు. కానీ, ముఖ్యమంత్రికి వైద్య పరీక్షల్లో అంతా నార్మల్ అని తేలడంతో ఆయన్ను తిరిగి ఇంటికి పంపాలని వైద్యులు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. యశోదా డాక్టర్లు ప్రెస్ మీట్ పెట్టి ఆరోగ్య వివరాలు వెల్లడిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది.


మంత్రి కేటీఆర్ ఉప్పల్‌ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి వెళ్లారు. విషయం తెలిసిన వెంటనే కేటీఆర్ అక్కడ్నుంచి యశోద ఆస్పత్రికి బయల్దేరి వచ్చారు. మంత్రి హరీశ్ రావు ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ఆస్పత్రి బయట మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌కు ఆరోగ్యం అంతా నార్మల్‌గానే ఉన్నట్లు చెప్పారు. రెండ్రోజుల నుంచి సీఎం వీక్‌గా ఉన్నారని వెల్లడించారు.