KCR At Yashoda Hospital: ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయన సోమాజిగూడ యశోద ఆస్పత్రికి (Yashoda Hospital) వెళ్లారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కేసీఆర్‌కు యాంజియోగ్రామ్, సిటీ స్కాన్ పరీక్షలు వంటి పరీక్షలు చేశారు. నేటి యాదాద్రి పర్యటన కూడా రద్దు అయింది.
దీనిపై సీఎం కేసీఆర్ (KCR) వ్యక్తిగత వైద్యుడు, యశోద హాస్పిటల్‌లో జనరల్ ఫిజీషియన్ అయిన డాక్టర్ ఎంవీ రావు (Doctor MV Rao) స్పందించారు. సీఎం కేసీఆర్ (KCR) రెండు రోజులుగా నీరసంగా ఉన్నారని, ఎడమ చేయి లాగుతున్నట్లుగా చెప్పారని అన్నారు. ప్రాథమిక పరీక్షల తర్వాత యాంజియోగ్రామ్ చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు. జనరల్ చెకప్ లో భాగంగా అన్ని రకాల పరీక్షలు కూడా చేస్తామని ఆయన వెల్లడించారు.
యశోద హాస్పిటల్‌కు (Yashoda Hospital) వచ్చిన సీఎం కేసీఆర్‌తో పాటు ఆయన సతీమణి శోభ, కుమార్తె కవిత, మనవడు హిమన్షు రావు, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, భద్రతా సిబ్బంది ఉన్నారు. మంత్రి కేటీఆర్ సహా ఆయన ఫ్యామిలీ కూడా వెంటనే యశోద ఆస్పత్రికి చేరుకున్నారు. మంత్రి కేటీఆర్ ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి వెళ్లారు. విషయం తెలిసిన వెంటనే కేటీఆర్ అక్కడ్నుంచి యశోద ఆస్పత్రికి బయల్దేరి వచ్చారు. మంత్రి హరీశ్ రావు ఆస్పత్రికి చేరుకున్నారు.
ఫోటోలు చూడండి: In Pics: కేసీఆర్‌కు యశోదలో మెడికల్ టెస్టులు - యాంజియోగ్రామ్ పరీక్ష చేసిన డాక్టర్లు
యాంజియోగ్రామ్ పరీక్ష పూర్తి
ముఖ్యమంత్రి ఆస్పత్రికి చేరుకున్న కాసేపటికి వైద్యులు యాంజియోగ్రామ్ పరీక్షను పూర్తి చేశారు. రిపోర్టులు పరీక్షించిన డాక్టర్లు గుండె లోపల ఎలాంటి బ్లాక్స్ లేవని తెలిపారు. యాంజియోగ్రామ్ పరీక్ష నివేదిక పూర్తి నార్మల్‌గానే ఉందని వెల్లడించారు. గుండె సంబంధిత సమస్యలు ఏమీ లేవని ప్రకటించారు.
ఆస్పత్రికి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్
యశోద ఆస్పత్రికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (Hyderabad CP) సీవీ ఆనంద్ (CV Anand) కూడా చేరుకున్నారు. ముఖ్యమంత్రి రాకతో హాస్పిటల్ చుట్టుపక్కల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
వాహనాల దారి మళ్లింపు
ముఖ్యమంత్రి కేసీఆర్ సోమాజీగూడలోని (Somajiguda) యశోద ఆస్పత్రికి రావడంతో రాజ్ భవన్ రోడ్డు (Raj Bhavan Road) మొత్తం పోలీసులు ఆంక్షలు విధించారు. ఆ రోడ్డులో వాహనాల రాకపోకలను అనుమతించకుండా దారి మళ్లిస్తున్నారు.