Harish Rao Files Quash Petition In Telangana High Court | హైదరాబాద్: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. హరీష్ రావు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో తన మీద నమోదైన కేసు కొట్టివేయాలని బుధవారం నాడు హైకోర్టులో హరీష్ రావు పిటిషన్ వేశారు. బీఆర్ఎస్ నేతలను ఇబ్బంది పెట్టేందుకు ఉద్దేశపూర్వకంగా ఫిర్యాదు చేసి, అక్రమ కేసులు బనాయిస్తున్నారని హైకోర్టుకు హరీష్ రావు తెలిపారు.
సిద్దిపేటకు చెందిన కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ హయాంలో హరీష్ రావు తన ఫోన్ టాప్ చేయించారని చక్రధర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. హరీష్ రావుతో పాటు మాజీ డిసిపి రాధాకృష్ణన్ రావుపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. రాజకీయ కక్షతోనే తనపై కేసు నమోదు చేశారని పిటిషన్ లో హరీష్ రావు పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలు చేసి సంబంధం లేని కేసులో ఇరికిస్తున్నారని హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ వేశారు. తనపై పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టివేయడంతో పాటు అరెస్టు చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో హైకోర్టును హరీష్ రావు కోరారు.