Hydra has taken another key decision will take complaints every on Monday from 2025 | హైదరాబాద్‌: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం భూముల ఆక్రమణలపై ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోవాలని హైడ్రా నిర్ణయం తీసుకుంది. నూతన సంవత్సరం నుంచి ప్రతి సోమవారం నాడు బుద్ధభవన్ హైడ్రా ఆఫీసులో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు హైడ్రా తెలిపింది. నాలాలు, పార్కుల భూమితో పాటు చెరువుల ఆక్రమణపై ప్రజలు తమ అర్జీల ఇవ్వొచ్చని ఓ ప్రకటనలో హైడ్రా సూచించింది. 


కాగా, హైడ్రా అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇటీవల హైడ్రాకు రూ.50 కోట్ల మేర నిధులు కేటాయించింది. త్వరలోనే ఆ నిధులు హైడ్రా సంబంధిత ఖాతాలో జమ కానున్నాయి. వాటిని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ లెక్కలు చూపించి నిధులు విత్‌డ్రా చేసుకుని ఖర్చు చేయనున్నారు.


హైడ్రాకు రూ.50 కోట్లు విడుదల చేసిన పురపాలక శాఖ
హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రవేశపెట్టిన వ్యవస్థ హైడ్రా (HYDRA). ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువులు, పార్కుల భూముల్ని పరిరక్షించేందుకు హైడ్రాను సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేశారు. కొన్ని రోజుల కిందట కూల్చివేతలు నిలిపివేసిన హైడ్రా మళ్లీ కూల్చివేతలు చేపట్టింది. అయితే ఆక్రమణదారులు, పర్మిషన్ లేకుండా నిర్మాణాలు చేపట్టిన వారికి ఇబ్బందులు, కానీ అనుమతులు ఉన్న వారికి ఏ సమస్యా ఉండదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పలుమార్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాకు నిధులు విడుదల చేసింది.



హైదరాబాద్, జీహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వ స్థలాలు, పార్క్‌లు, నాలాల వద్ద అక్రమ నిర్మాణాల కూల్చివేత, చెరువుల పునరుద్ధరణ, విపత్తు నిర్వహణ కోసం పనిచేస్తోన్న హైడ్రా కోసం పురపాలక శాఖ రూ.50కోట్లు విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ లో హైడ్రాకు రూ.200 కోట్లు కేటాయించగా.. ఇందులో రూ.50 కోట్లు విడుదల చేస్తున్నట్లు పురపాలకశాఖ  ముఖ్యకార్యదర్శి దాన కిశోర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో హైడ్రా వ్యవస్థపై ఉన్న అనుమానాలు తొలగిపోయాయి.


అధికారులపై సైతం చర్యలు తీసుకోనున్న హైడ్రా


చెరువులు, జలాశయాల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలను.. ప్రభుత్వ స్థలాలు, పార్కులు, నాలాలు ఆక్రమించి కట్టిన నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేస్తుంది. సంగారెడ్డి అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కొన్ని రోజులకిందట పర్యటించారు. అమీన్‌పూర్‌ పెద్ద చెరువు, హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీ, శంభునికుంట, వెంకరమణ కాలనీ, పద్మరావు నగర్ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆయన అక్కడి ప్రజలతో కాసేపు మాట్లాడారు. అక్రమ నిర్మాణాలు కూల్చివేయడంతో పాటు, వాటికి నిబంధనలకు విరుద్ధంగా అనుమతి ఇచ్చిన అధికారులపై సైతం చర్యలు తీసుకుంటామని రంగనాథ్ స్పష్టం చేశారు. అమీన్ పూర్ చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు, కబ్జాలపై వరుస ఫిర్యాదులు రావడంతో నేరుగా ఆయన పరిశీలనకు వెళ్లారు. 


Also Read: Earthquake In Hyderabad List: 50ఏళ్లలో హైదరాబాద్ పరిధిలో ఏర్పడ్డ అతి పెద్ద భూకంపం ఇదే - ఇప్పటి వరకు వచ్చిన భారీ భూకంపాల లిస్ట్