Congress leader Chakradhar Goud Exclusive Interview with ABP Desam | హైదరాబాద్: తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావుపై ఫోన్ ట్యాపింగ్ చేశారన్న ఫిర్యాదుతో కేసు నమోదైంది. హరీష్ రావు చిన్నపిల్లాడు కాదు, సుద్దపూస ఏం కాదని.. ఏడాది పాటు తన భార్యతో జరిపిన సంభాషణను సైతం బీఆర్ఎస్ హయాంలో విన్నారని సంచలన విషయాలు కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ వెల్లడించారు. బీఆర్ఎస్ హయాంలో తనపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టారని, తన ఫోన్ ట్యాప్ చేసి వేధింపులకు గురిచేశారని సిద్ధిపేటకు చెందిన కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఆరోపించారు. చ్రక్రధర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో హరీశ్ రావుపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. హరీశ్ రావు పై పెట్టిన కేసు వెనుక అసలు నిజాలేంటీ.. ఏబీపీ దేశం ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో బాధితుడు చక్రధర్ గౌడ్ సంచలన విషయాలు వెల్లడించారు.
హరీష్ రావు దగ్గరుండీ ఫోన్ ట్యాపింగ్ చేయించారు
హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసి, పోలీసులకు ఫిర్యాదు చేసిన సిద్దిపేట కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఏబీపీ దేశంతో మాట్లాడుతూ.. నా ఫోన్ టాపింగ్ చేశారన్న ఫిర్యాదుతో హరీష్ రావుపై కేసు నమోదు అయ్యింది. సిద్దిపేటలో వార్ రూమ్ ఏర్పాటు చేసి రాధాకిషన్ రావు, భుజంగ రావు, ప్రణీత్ రావు నా ఫోన్ ట్యాప్ చేశారు. హరీష్ రావు నా ఫోన్ టాపింగ్ చేయించాడు. తనకు రాజకీయంగా అడ్డు వస్తున్నానని నాపై కక్ష పెంచుకున్నాడు. హరీష్ రావుకు నేను ఎప్పుడు భయపడడలేదు. హరీష్ రావును అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. ఫోన్ ట్యాప్ విషయంపై 2023 నుంచి ఇప్పటిదాకా కొట్లాడుతున్న. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చూయించిన మెయిల్ నాకు వచ్చింది. ఫోన్ ట్యాప్ అయ్యింది అని డిజిపికి వినతిపత్రం ఇచ్చాను. న్యాయం జరగకపోవడంతో కోర్టుకు వెళ్లాను.
రేప్ కేసులు పెట్టారు, చంపుతామని వార్నింగ్
నా ఇంట్లో 20 ఫోన్లు ట్యాప్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో నా మీద రేప్ కేసు, ఉద్యోగాల మోసం కేసులు పెట్టించి తీవ్ర ఇబ్బందులకు గురి చేసారు. నన్ను రాధాకిషన్ రావు చంపుతా అని బెదిరించాడు. హరీష్ రావు చిన్నపిల్లగాడు కాదు. ఎన్నో కుటుంబాలను, వ్యాపారస్తులను వారి పాలనలో లొంగదీసుకున్నారు. నా మీద ఆరు కేసులు నమోదయ్యాయి. నా యాపిల్ ఫోన్ నుండి ఫోన్ ట్యాప్ అయినట్లు మెసేజ్ వచ్చింది. హరీష్ రావు సంవత్సరం పాటు నా ఫోన్ ట్యాపింగ్ చేశారు.
నా భార్యతో ఫోన్లో మాట్లాడింది విన్నారు, రికార్డ్ చేశారు..
నా భార్య, తల్లితో ఫోన్లో మాట్లాడింది అంతా రికార్డ్ చేశారు. నా డ్రైవర్‌తో మాట్లాడింది కూడా రికార్డ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అక్రమ అరెస్టులు జరిగాయి. మాజీ మంత్రి హరీష్ పీఏ హోంగార్డ్ జాబ్ ఇస్తానని చెప్పి మోసం చేసిన ఆడియోను నేనే లిక్ చేశాను. ఫోన్ ట్యాప్ కేసులో నేను కోర్టుకెళ్లాను. నా లాంటి బాధితులు ఎంతో మంది ఉన్నారు, వాళ్లు ముందుకు రావాలి. ఫోన్ ట్యాప్ కేసులో బాధితులు చాలా కీలకం. నన్ను ఇబ్బందులు పెట్టి బీఆర్ఎస్ పార్టీలోకి రమ్మన్నారు. నేను బీఎస్పీ నుంచి ఎన్నోకల్లో పోటీ చేసిన సమయంలో నా ఫోన్ ట్యాపింగ్ చేశారు.
హరీష్ రావుతో నాకు ప్రాణహాని ఉందని డీజీపీకి విన్నవించుకున్నా పట్టించుకోలేదు. హరీష్ రావు సుద్దపూస కాదు. ఆయన చేసిన స్కాంలు అన్ని బయటపెడుతా. రాధాకిషన్ రావును కస్టడీలోకి తీసుకుంటే నిజాలు బయటకు వస్తాయి. బీఆర్ఎస్ వల్లే తెలంగాణ 3 తరాలు వెనక్కి పోయింది. కమీషన్ల కోసం హరీష్ రావు కమిట్మెంట్ ఇస్తాడు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే హరీష్ రావు ఓడిపోవడం ఖాయమన్నారు’ కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్.
Also Read: Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్ విధానం