Home Permissions in Telangana: భవనాలు, లేఅవుట్ అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తులను సకాలంలో పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏ అధికారి దగ్గర కూడా 10 రోజులకు మించి ఆలస్యం లేకుండా ప్రక్రియ ముందుకు సాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. హెచ్‌ఎండీఏ పరిధిలోని దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం జరుగుతోందన్న వార్తలను సర్కార్ తోసిపుచ్చింది. ఈ క్రమంలోనే భవనాలు, లే అవుట్ల అనుమతులకు ‘బిల్డ్ నౌ’ పేరుతో కొత్త ఆన్‌లైన్ విధానాన్ని కాంగ్రెస్ సర్కార్ అందుబాటులోకి తెచ్చింది. ‘బిల్డ్ నౌ’ పేరుతో ఏర్పాటు చేసిన ఈ విధానాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మంగళవారం లాంచ్ చేశారు.
సీఎం రేవంత్ పర్యవేక్షణ
గతంలో లేని విధంగా పట్టణాభివృద్ధిలో పలు కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 60 శాతం మంది జనాభా పట్టణ, నగర ప్రాంతాల్లో ఉంటున్నందున ఈ శాఖపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఈ శాఖపై స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో వ్యాపారాలకు అనువైన వాతావరణం కల్పిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ధి విధానాలను కొనసాగిస్తున్నట్లు శ్రీధర్ బాబు ప్రకటించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కోక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తమ ప్రభుత్వం కొత్త పథకాలను అమలు చేస్తుందన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పటికీ హైదరాబాద్ ప్రథమ స్థానంలో ఉందన్నారు. హైదరాబాద్ ప్రజలే గృహ రుణాలు అధికంగా తీసుకుంటున్నారని మంత్రి వెల్లడించారు.
అమల్లోకి టీజీబీపాస్ 2.0
రాష్ట్రంలో ఇళ్లు, వాణిజ్య సముదాయాలు, లేఅవుట్లు తదితర వాటికి అనుమతులు పొందే ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీజీబీపాస్‌కు ఏఐ ద్వారా కొత్త ఫీచర్లను అద్దుతున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత పారదర్శకంగా, మెరుపు వేగంతో అనుమతులు ఇచ్చేలా దీన్ని తయారు చేస్తుంది ప్రభుత్వం. ప్రస్తుతం ‘TGBPass 2.0’గా పిలవబడే ఈ కొత్త అప్లికేషన్‌ను డిసెంబర్ 1 నుంచి నిర్వహించనున్న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విజయోత్సవ వేడుకల సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది. జీహెచ్ ఎంసీతో సహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, మున్సిపాలిటీలలో ఇది అందుబాటులో ఉంటుంది.
ఇక ఇంటి అనుమతులు సులభతరం
ఇంటి నిర్మాణానికి అనుమతులు పొందే ప్రక్రియను సులభతరం చేసేందుకు గత ప్రభుత్వం TSBPass అనే పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయాలు, లేఅవుట్లు తదితర నిర్మాణాల అనుమతుల కోసం ఆఫీసులకు వెళ్లకుండానే నగర, మున్సిపల్ సంస్థల పరిధిలో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్‌లో పేర్కొన్న వివరాలన్నీ నిబంధనలకు లోబడి ఉన్నాయా లేదా అని కంప్యూటర్ ఆటోమేటిక్ గా విశ్లేషిస్తుంది. అన్నీ సరిగ్గా ఉంటేనే అనుమతి ఇస్తారు. లేకపోతే, డ్రాయింగ్‌లను సరిదిద్దాలి. మళ్లీ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. పాత పద్ధతిలో ఇళ్లు, బహుళ అంతస్తుల భవనాలు, లేఅవుట్లు తదితరాలను విడివిడిగా విశ్లేషించాల్సి ఉన్నందున చాలా సమయం పట్టేది.
బహుళ అంతస్తుల భవనాల వంటి వాటికి అనుమతులు రావాలంటే రెండు నుంచి 30 రోజుల సమయం పట్టేది. అంతేకాకుండా, దరఖాస్తు ప్రక్రియ గందరగోళంగా ఉండేది. దీన్ని చక్కదిద్దేందుకు.. సరైన అనుమతి ఉంటేనే అనుమతులు ఇవ్వడం.. నిబంధనల ప్రకారం లేకుంటే తిరస్కరించడం వంటివి వేగంగా జరిగేందుకు.. ప్రస్తుత ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు టీజీబీపాస్‌కు అత్యాధునిక సాంకేతికతను జోడించారు. ప్రస్తుతం దీనికి ‘టీజీబీపాస్ 2.0’ అని పిలుస్తున్నా.. త్వరలో దీనికి కొత్త పేరు పెట్టనున్నారు.