Telangana: హైదరాబాద్‌లో మెట్రో వచ్చిన తర్వాత ప్రయాణం చాలా సులభతరమైంది. మొదట్లో టికెట్ రేట్లు ఎక్కువ అనుకున్న వాళ్లంతా ఇప్పుడు మెట్రో ప్రయాణమే బెటర్ అనుకుంటున్నారు. సమయం ఆదాతోపాటు ట్రాఫిక్ ఇబ్బందుల్లేకుండా అనుకున్న సమయానికి గమ్యానికి చేరుకోవచ్చని ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగులకు ఇదో వరంలా మారిందనే చెప్పాలి. అందుకే ఈ మెట్రోను మరిన్ని ప్రాంతాలకు అందుబాటులోకి తీసువచ్చేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు సాగుతున్నాయి. ఆ ప్రయాత్నాలు ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తున్నట్టు సమాచారం అందుతోంది. 


25వేల కోట్లతో డీపీఆర్


హైదరాబాద్‌ మెట్రో రైలు విస్తరణకు సంబంధించిన డీపీఆర్‌పై సిస్ట్రా అనే ప్రైవేట్ కన్సల్టెన్సీ పని చేస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే రెండో దశ విస్తరణకు సంబంధించి ప్లాన్ రూపొందించినట్టు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి విదేశాల నుంచి రాగానే ఈ ప్రాజెక్టు ప్లాన్‌పై ఆయనతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. సుమారు 80 కిలోమీటర్ల విస్తరించనున్న మెట్రో ఐదు కారిడార్లను ఏర్పాటు చేయనున్నారు. దీని కోసం దాదాపు పాతికవేల కోట్ల అంచనాతో దీన్ని రూపొందించారు. 


ఐదు కారిడార్లకు ఐదు రిపోర్ట్స్‌


ఐదు కారిడార్‌లను నిర్మించాలని భావిస్తున్న హైదరాబాద్‌ మెట్రో అధికారులు ఒక్కో కారిడార్‌కు ఒక్కో ప్లాన్ సిద్ధం చేశారు. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న పాతబస్తీ మెట్రోను మొదటిప్రాతిపదికన చేపట్టనున్నారు. ఈ రూట్‌ను చాంద్రాయణగుట్టవరకు విస్తరించనున్నారు. ఈ నెలాఖరుకు రెండోదశ విస్తరణకు సంబంధించిన డీపీఆర్‌ ఆమోదించుకుంటే తర్వాత చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌ మెట్రో అధికారులు భావిస్తున్నారు. 


ఐదు కారిడార్ల నిర్మాణం ఐదు కంపెనీలకు.. 


2029 నాటికి రెండో దశ మెట్రో విస్తరణ పనులు పూర్తి చేయాలని భావిస్తున్న అధికారులు ఆ ప్లాన్‌తోనే డీపీఆర్‌ రూపొందించారు. ఐదు కారిడార్‌లకు వేర్వేరు రిపోర్టు సిద్ధం చేసిన అధికారులు... పనులు కూడా వేర్వేరు సంస్థలకు అప్పగించాలని యోచిస్తున్నారు. దీని వల్ల త్వరగా పనులు ఒకే సమయంలో పూర్తి అవుతాయని వారి ఆలోచనగా ఉంది. 


నాగోల్‌ టూ శంషాబాద్‌ లైన్‌ ఖర్చే ఎక్కువ!


ఐదు కారిడార్‌లలో నాగోల్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు నిర్మించబోయే మెట్రో లైన్‌కు ఎక్కువ ఖర్చు కానుందని తెలుస్తోంది. ఇది దాదాపు 31 కిలోమీటర్ల దూరానికి డీపీఆర్ సిద్ధం చేశారు. దీని కోసం దాదాపు 8వేల కోట్లతో అంచనాలు సిద్ధం చేశారు. మొదటి  దశ మెట్రో లైన్లను పూర్తిగా పీపీపీ మోడల్‌లో నిర్మించారు. కానీ ఇప్పుడు రెండో దశను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మిస్తున్నాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 35 శాతం నిధులు భరిస్తే... కేంద్రం 15 శాతం నిధులు సమకూరుస్తుంది. మరో 45 శాతం వివిధ సంస్థల నుంచి రుణాలు రూపంలో, ఇంకో ఐదు శాతం పీపీపీ విధానంలో ఇస్తారు. ఇప్పటికే ఎయిర్‌పోర్టు వరకు నిర్మించే లైన్‌లో జీఎంఆర్‌ భాగస్వామ్యం కానుంది. 


Also Read: తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు, ఎలివేటెడ్ కారిడార్‌ జాప్యంలో అధికారులపై మంత్రి కోమటిరెడ్డి సీరియస్ 


Also Read: ‘ఫోర్త్ సిటీ’ పేరుతో కాంగ్రెస్ భూదందా, వేల ఎకరాలు సేకరించి దోచుకునే కుట్ర: బండి సంజయ్