Komatireddy Venkat Reddy : హైదరాబాద్‌లోని ఉప్పల్ ఏరియాలో ఆదివారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటించారు. స్థానిక ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి ఉప్పల్ - నారపల్లి మార్గంలో ఎలివేటెడ్ కారిడార్‌ పనులను కోమటిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంతో మంత్రి అధికారులపై సీరియస్ అయ్యారు. కేవలం నిర్లక్ష్యం కారణంగానే పనులు పూర్తి కాలేదని అన్నారు.2018లో ప్రారంభమైన ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తి కాలేదన్నారు. నిర్మాణ పనుల కారణంగా రోడ్డు గుంతలమయంగా మారిందన్నారు. ఈ కారణంగా ఆ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు మంత్రి కోమటిరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. 15 రోజుల్లో కల్వర్లు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆర్అండ్ బీ అధికారులపై మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ల మీద పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దంటూ వారికి వార్నింగ్ ఇచ్చారు. ఆరేళ్లుగా పనులు పూర్తి కాకపోవడం గత బీఆర్ఎస్ ప్రభుత్వానికే అవమానకరం అని అన్నారు. నారపల్లి నుంచి ఉప్పల్‌ వరకు రహదారి నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో నివేదించాలని అధికారులను ఆదేశించారు.


కాంట్రాక్టర్ల పై నెట్టొద్దు
ప్రస్తుతం వానాకాలం కావడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. తక్షణమే రోడ్ల మరమత్తులపై కూడా నివేదిక అందజేయాలని సంబంధిత శాఖాలకు చెందిన అధికారులను ఆదేశించారు. 7వ తేదీ నుంచి పనులు ప్రారంభిస్తామని ఆర్ వో పుష్ప మంత్రి కోమటిరెడ్డికి తెలిపారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడిచేది ప్రజలు కట్టే పన్నుతో.. వంతెన నిర్మాణంలో ఆర్‌అండ్‌బీ అధికారులు పూర్తిస్థాయిలో విఫలమయ్యారు. ఈ చర్చలో పాల్గొనేందుకు మీరు అర్హులు కారు. వీలైనంత త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేయడానికి మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి? కాంట్రాక్టర్ పై పూర్తి నెపం నెట్టడం కాదు.. మీరు చేయాల్సిన పనిని సక్రమంగా చేయలేక పోయారు. జీహెచ్‌ఎంసీ, ఫారెస్ట్‌, కాంట్రాక్టర్‌ అంటూ సాకులు చెప్పొద్దు’’ అంటూ మండిపడ్డారు. సెప్టెంబరు చివరి కల్లా ఎలివేటెడ్‌ కారిడార్‌ టెండర్‌ పనులు పూర్తి చేయాలన్నారు. పనులు మొదలుపెట్టిన రెండున్నరేళ్లలోగా ఫ్లైఓవర్‌ పనులు పూర్తి కావాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు ఎక్కువ సమయం ఫ్లైఓవర్‌ పనులకే కేటాయించాలంటూ సూచించారు. 
 
పనులు మూడడుగులు వెనక్కి
ఉప్పల్‌ నుంచి వరంగల్‌ వెళ్లే మార్గంలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి చేపట్టిన ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు నత్తనడకన సాగుతున్నాయి. శంకుస్థాపన చేసి నాలుగేళ్లు కావస్తున్నా ఇంతవరకు పనులు పిల్లర్లు దాటలేదు. ఒక అడుగు ముందుకు, మూడడుగులు వెనక్కి అన్నట్లుగా పరిస్థితి మారింది. ట్రాఫిక్ సమస్య పరిష్కారం కాకపోగా పనులు కారణంగా మరింత రద్దీగా మారింది. ఫ్లైఓవర్ పనుల కోసం ఎక్కడికక్కడ తవ్విన మట్టి, రోడ్లపై గుంతలు, వాహనాలు వెళ్లే మార్గంలో ఎగిసిపడే దుమ్ముతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. రోజూ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతోంది.


2018లో శంకుస్థాపన..
 కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ  మే 2018లో 626.76 కోట్ల అంచనా వ్యయంతో ఉప్పల్ నుండి నారపల్లి వరకు ఎలివేటెడ్ కారిడార్‌ కు శంకుస్థాపన చేశారు. ఈ ఫ్లైఓవర్ రామంతాపూర్‌లో ప్రారంభమై నారపల్లి సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ వద్ద ముగుస్తుంది. మొత్తం 148 పిల్లర్లపై 45 మీటర్ల వెడల్పుతో ఆరు లైన్లలో నిర్మాణాన్ని ప్రారంభించారు. ఎలివేటెడ్ కారిడార్‌కు ఇరువైపులా 150 అడుగుల విస్తీర్ణంలో సర్వీస్ రోడ్లు నిర్మించాలని నిర్ణయించారు. 2022 నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా ఆ స్థాయిలో పనులు జరగలేదు. నాలుగేళ్లలో పిల్లర్లు మాత్రమే పూర్తయ్యాయి. ప్రీ-కాస్ట్ పద్ధతిలో పిల్లర్లపై స్లాబ్ సెట్టింగ్ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. 148 పిల్లర్లకు గాను 128 పిల్లర్లు వేశారు. మిగిలినవి వేయాలి. నారపల్లి వద్ద ఇప్పటి వరకు ఒకటి, ఐదు పిల్లర్లకు మాత్రమే స్లాబ్‌లు వేశారు. ఇదిలా ఉండగా ఎక్కడికక్కడ తవ్వడంతో రోడ్డు మొత్తం గుంతలమయంగా మారింది. వాహనాలు వెళ్లేటప్పుడు దుమ్ము ఎగిసిపడుతోంది.


జాప్యానికి కారణాలివే 
రామాంతపూర్ నుంచి ప్రారంభమయ్యే ఈ ఎలివేటెడ్ కారిడార్‌ను ఉప్పల్ మెట్రో లైన్‌కు ఎగువన నిర్మించనున్నారు. అయితే కారిడార్ ఎత్తును ముందుగా నిర్ణయించిన దానికంటే ఎక్కువగా పెంచాలని అధికారులు నిర్ణయించారు. పెరిగిన ఎత్తుకు అనుగుణంగా స్టీల్, ఇతర వస్తువుల ధర పెరిగింది. దీంతో పనుల్లో కొంత జాప్యం జరుగుతోంది. అలాగే కారిడార్‌కు ఇరువైపులా నిర్మిస్తున్న సర్వీస్‌ రోడ్లకు స్థల సేకరణలో ప్రభుత్వం జాప్యం చేస్తోందన్న ఆరోపణలున్నాయి. ఇప్పటి వరకు భూములిచ్చిన వారికి నష్టపరిహారం అందించకుండా తాత్సారం చేస్తున్నారన్నారు. నష్టపరిహారం విషయంలో కొందరు కోర్టును ఆశ్రయించడం కూడా లేటుకు కారణమైంది. మొత్తంగా భూసేకరణ పూర్తయితే గానీ పనులు వేగవంతం కావని అధికారుల చెబుతున్నారు.