TTD Request To Devotees: తిరుమలలో (Tirumala) సీనియర్ సిటిజన్లకు (Senior Citizens) స్వామి వారి దర్శనంపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. ప్రతి రోజూ వెయ్యి మంది వృద్ధులు, దివ్యాంగులకు వెంకటేశుని దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు తెలిపింది. 3 నెలల ముందే ఆన్ లైన్‌లో టికెట్ల కోటాను రిలీజ్ చేస్తామని.. ప్రతి నెలా 23వ తేదీన సీనియర్ సిటిజన్లకు దర్శనాలకు సంబంధించి టికెట్లను జారీ చేస్తామని స్పష్టం చేసింది. వారిని తిరుమల నంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్/పీహెచ్సీ లైన్ ద్వారా రోజూ మధ్యాహ్నం 3 గంటలకు స్వామి వారి దర్శనానికి అనుమతిస్తామని పేర్కొంది. స్వామి వారి దర్శనాలు, గదుల కేటాయింపు, ఇతర సేవలకు సంబంధించి సరైన సమాచారం కోసం భక్తులు టీటీడీ అధికారిక వెబ్ సైట్ మాత్రమే సందర్శించాలని టీటీడీ అధికారులు సూచించారు.
రెండుసార్లు గరుడ సేవ
తిరుమల శ్రీవారికి ఈ నెలలో రెండుసార్లు గరుడవాహన సేవ జరగనుంది. ఈ నెల 9న గరుడ పంచమి 19న శ్రావణ పౌర్ణమి పర్వదినాల సందర్భంగా స్వామి వారు గరుడ వాహనంపై నాలుగు మాఢ వీధుల్లో విహరించి భక్తులకు అభయమివ్వనున్నారు. గరుడ పంచమి రోజున శ్రీ మలయప్పస్వామి వారు రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ఇష్టవాహనమైన గరుడునిపై అధిరోహించి భక్తులను అనుగ్రహించనున్నారు. ప్రతి ఏడాది గరుడ పంచమిని శుక్ల పక్షమి 5వ రోజున టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది.
అక్టోబర్‌లో వార్షిక బ్రహ్మోత్సవాలు
మరోవైపు, శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను అక్టోబరులో ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా అక్టోబర్ 4న ధ్వజారోహణం, 8న గరుడసేవ, 9న స్వర్ణరథం, 11న రథోత్సవం, 12న చక్రస్నానం కార్యక్రమాలు నిర్వహిస్తారు. శ్రీవారి వాహన సేవలు ప్రతి రోజు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు ప్రారంభించనున్నట్లు టీటీడీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. సాధారణంగా గరుడ సేవ రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉండనున్న క్రమంలో అక్టోబర్ 7న రాత్రి 11 గంటల నుంచి అక్టోబర్ 8న అర్ధరాత్రి వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలపై నిషేధం అమలు చేయనున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఎన్‌ఆర్‌ఐలు, వయో వృద్ధులు, వికలాంగులు, చిన్న పిల్లల తల్లిదండ్రులతో సహా అన్ని ఆర్జిత సేవలు, శ్రీవారి ప్రత్యేక దర్శనాలు రద్దు చేయనుంది.
అన్నదానం ట్రస్టుకు రూ.కోటి విరాళం
శ్రీవారి అన్న ప్రసాదం ట్రస్టుకు హైదరాబాద్‌కు చెందిన సుమధుర గ్రూప్ సీఎండీ మధుసూదన్ రూ.కోటి విరాళం అందించారు. ఈ మేరకు విరాళానికి సంబంధించిన డీడీని గోకులం అతిథి భవనంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు భరత్ కుమార్, నవీన్ కుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
అటు, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనం కోసం 11 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. శనివారం శ్రీవారిని 75,140 మంది భక్తులు దర్శించుకోగా.. 28,256 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామి వారి హుండీ ఆదాయం రూ.3.76 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
Also Read: AP Capital Donations: అమరావతి కోసం రెండు బంగారు గాజులు విరాళంగా ఇచ్చిన విజయవాడకు చెందిన వృద్ధురాలు