Two Youth Died In Severe Accident In Hyderabad: హైదరాబాద్‌లో (Hyderabad) జరిగిన ఘోర ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. బైక్‌పై వేగంగా వెళ్తూ కొత్తగూడ ఫ్లైఓవర్ (Kothaguda Flyover) పైనుంచి కింద పడి ఇద్దరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రోహిత్, జాబ్ సెర్చింగ్‌లో ఉన్న బాలప్రసన్న మియాపూర్‌లో నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ బైక్‌పై మసిద్‌బండ నుంచి హఫీజ్‌పేట్ వెళ్తుండగా.. కొత్తగూడ ఫ్లైఓవర్ వద్ద వాహనం అదుపుతప్పింది. బైక్ వేగంగా గోడను ఢీకొని ఇద్దరూ బ్రిడ్జి పైనుంచి కిందపడ్డారు. తీవ్రంగా గాయపడిన వీరిని గమనించిన స్థానికులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అతివేగంగా బైక్ నడపడం వల్లే వాహనం అదుపు తప్పి ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Continues below advertisement


మరో ప్రమాదంలో..


అటు, రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో మరో ప్రమాదం జరిగింది. నందిగామ రంగాపూర్ శివారు దర్గా రోడ్డు మూలమలుపు వద్ద ఆర్టీసీ బస్సును స్కూటీ ఢీకొనడంతో ఓ మహిళ, బాలుడు ప్రాణాలు కోల్పోయారు. మరో బాలునికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గాయపడ్డ బాలున్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు హజరత్ బేగం (35), అబ్దుల్ రహమాన్ (12)గా గుర్తించారు. గాయపడ్డ రహీం (9) పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


దుర్గంచెరువులో మృతదేహం లభ్యం


మరోవైపు, మాదాపూర్ దుర్గంచెరువులో ఆదివారం ఓ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు నంబూరి చాణిక్యవర్మగా గుర్తించారు. అతను మాదాపూర్‌లోని చందానాయక్ తండాలో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అంతకు ముందు రోజు ఇతను ఇంటికి రాకపోయే సరికి అతని సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా, చాణక్యవర్మ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.


Also Read: Hyderabad News: చాక్లెట్ ఇప్పిస్తానని బాలిక కిడ్నాప్ - గంటల్లోనే ఛేదించిన పోలీసులు, కిడ్నాపర్‌పై చిన్నారి బంధువుల దాడి