Man Kidnapped Minor In Hyderabad: ఓ దుండగుడు చాక్లెట్ ఇస్తానని చెప్పి బాలికను కిడ్నాప్ చేశాడు. పాప కనిపించక కంగారు పడిన బంధువులు పోలీసులను ఆశ్రయించగా సీసీ ఫుటేజీ పరిశీలించి 5 బృందాలుగా ఏర్పడి గంటల్లోనే నిందితున్ని పట్టుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని (Hyderabad) అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ బేగంబజార్ ఛత్రి ప్రాంతంలో ప్రియాంక అనే మహిళ తన సోదరునితో కలిసి నివసిస్తోంది. శనివారం సాయంత్రం తన సోదరుడు కుమార్తెతో కలిసి కట్టెలమండిలోని తల్లి ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో బాలిక ఆడుకునేందుకు బయటకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కంగారుపడిన ప్రియాంక, కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోయింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాలిక కిడ్నాప్
బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఓ అపరిచిత వ్యక్తి బాలికను ఆటోలో ఎక్కించుకుని వెళ్లడం గుర్తించారు. చాక్లెట్ ఇస్తానని చెప్పి పాపను ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. 5 బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిందితుని కోసం గాలింపు చేపట్టారు. గంటల్లోనే బాలిక ఆచూకీని గుర్తించి నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరులోని ఇనుముల నర్వలో పాపను గుర్తించిన పోలీసులు ఆమెను సేఫ్‌గా అబిడ్స్ తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. కిడ్నాపర్ బీహార్‌కు చెందిన బిలాల్‌గా గుర్తించారు. నిందితుడు కనిపించగానే బాలిక తల్లిదండ్రులు, బంధువులు అతనిపై దాడికి దిగగా పోలీసులు అడ్డుకున్నారు. అతికష్టం మీద నిందితున్ని అక్కడి నుంచి తరలించారు. పాపను సురక్షితంగా తమకు అప్పగించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. నిందితునిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.