Interstate Ganja Smuggling Gang Arrested in Warangal | వరంగల్: వరంగల్ కమిషనరేట్ పోలీసులు ఐదుగురు సభ్యుల గంజాయి రవాణా ముఠా గుట్టు రట్టు చేశారు. నిందితుల వద్ద నుంచి ఏకంగా 256 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలో శనివారం (ఆగస్టు 3న) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గంజాయి గ్యాంగ్‌కు సంబంధించిన వివరాలను సీపీ అంబర్ కిషోర్ ఝా వెల్లడించారు. పట్టుకున్న గంజాయి విలువ 64 లక్షలు ఉంటుందన్నారు. గంజాయి ముఠా వద్ద నుంచి రెండు కార్లు, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వెల్లడించారు.
నర్సంపేట పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు కలిసి నర్సంపేట స్టేషన్ పరిధిలోని కమలాపూర్ క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో గంజాయి రవాణా ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు సీపీ తెలిపారు. ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న క్రమంలో దొరికిపోయారని వెల్లడించారు. అరెస్ట్ అయిన నిందితులు బానోతు బాబు కుమారస్వామి, నస్కరి కుమారస్వామిలు కారు డ్రైవర్ గా చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లాకు చెందిన వీరికి మహబూబాబాద్ జిల్లాకు చెందిన జలెందర్, భూపాల్‌పల్లి జిల్లాకు చెందిన అంగోతు రాజేందర్, తూర్పు గోదావరికి చెందిన ముకుంద్ లతో పరిచయం ఏర్పడింది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు, అక్రమ సంపాదన ఆలోచనకు దారి తీసిందని సీపీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని డొంకరాయి పరిసర ప్రాంతాల్లో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు రహస్యంగా తరలించి గంజాయిని ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు విచారణలో నిందితులు చెప్పారు. డొంకరాయి గ్రామంలో 256 కిలోల గంజాయిని కోనుగోలు రెండుకిలోల చొప్పున 128 ప్యాకెట్ల లో ప్యాక్ చేసి కారులో ఎవరికి అనుమానం రాకుండా డొంకరాయి నుండి భద్రాచలం, మహబూబాబాద్ మీదుగా నర్సంపేటకి నిందితులు కారులో గంజాయిని తరలిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు అందిన పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ నర్సంపేట పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అరెస్ట్ చేసినట్లు అంబర్ కిషోర్ ఝ తెలిపారు. బానోతూ బాబు కుమారస్వామి, నస్కరి కుమారస్వామిల అరెస్ట్ చేయగా, జలెందర్, అంగోతు రాజేందర్, ముకుంద్ లు ముగ్గురు ప్రస్తుతం పరారీలో ఉన్నారని సిపి అంబర్ కిషోర్ ఝ వెల్లడించారు.