Paris 2024 Olympics: ఒలింపిక్స్‌ లో ఈరోజు భారత్‌‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. క్వార్టర్ ఫైనల్లో నెగ్గిన టీమిండియా హాకీ టీమ్ గ్రేట్ బ్రిటన్ పై నెగ్గి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. అయితే బ్యాడ్మింటన్ లో భారత్ కు నిరాశే ఎదురైంది. పురుషుల సింగిల్స్ లో భారత ఆటగాడు లక్ష్యసేన్ సెమీఫైనల్లో ఓటమి చెందాడు. లక్ష్యసేన్ పై 22-20, 21-14 తేడాతో డెన్మార్క్ ఆటగాడు విక్టర్ అక్సెల్సెన్ గెలుపొంది పారిస్ ఒలింపిక్స్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. అయితే లక్ష్యసేన్ కు పతకం గెలిచే అవకాశాలు ఇంకా సజీవంగా ఉన్నాయి. మరో సెమీఫైనల్లో ఓడిన ఆటగాడితో లక్ష్యసేన్ కాంస్య పతకం పోరులో తలపడనున్నాడు.


పారిస్ ఒలింపిక్స్ లో సెమీఫైనల్ చేరిన లక్ష్యసేన్.. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లో ఈ ఘటన సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. ఈ ఒలింపిక్స్ లో లక్ష్యసేన్ ఇదివరకే ప్రపంచ నాలుగో ర్యాంకర్ ను ఓడించాడు. అయితే సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్, ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ విక్టర్ అక్సెల్సెన్ చేతిలో పరాజయం పాలయ్యాడు. కానీ దిగ్గజ ఆటగాడిని సైతం లక్ష్యసేన్ తన స్మాష్ లు, ర్యాలీలతో ఆకట్టుకున్నాడు. వచ్చే ఒలింపిక్స్ లో లక్ష్య సేన్ గోల్డ్ మెడల్ రేసులో ఉంటాడని మ్యాచ్ అనంతరం అక్సెల్సెన్ చెప్పాడంటే.. భారత యువ సంచలనం ఏ స్థాయిలో ప్రదర్శన చేశాడో అర్థమవుతోంది.






లక్ష్యసేన్ తొలి సెట్ లో ప్రత్యర్థి అక్సెల్సెన్ తో హోరాహోరీగా తలపడ్డాడు. నువ్వా నేనా అన్నట్లుగా ఒక్కో పాయింట్ నెగ్గుతూ ఇద్దరు ఓ దశలో 9 పాయింట్లతో ఉన్నారు. అక్కడ లక్ష్యసేన్ వరుస పాయింట్లు సాధించి 18కి చేరుకున్నాడు. మరోవైపు 13 పాయింట్లతో ఉన్న డిఫెండింగ్ ఛాంపియన్ ఒక్కసారిగా విజృంభించాడు. అయినా యువ ఆటగాడు లక్ష్యసేన్ సైతం పాయింట్లు సాధిస్తూ మ్యాచ్ పాయింట్ కు వెళ్లాడు. కానీ అనుభవం ఉన్న అక్సెల్సెన్ వరుస పాయింట్లు నెగ్గి మ్యాచ్ పాయింట్ కు వచ్చాడు. వరుసగా రెండు స్మాష్ లతో తొలి సెట్ నెగ్గాడు. రెండో సెట్ లో లక్ష్యసేన్ వరుసగా 7 పాయింట్లు సాధించడంతో 7-0తో మంచి టచ్ లో కనిపించాడు. కానీ అనూహ్యంగా పుంజుకున్న డెన్మార్క్ ప్లేయర్, లక్ష్యసేన్ ను కొంచెం ఇబ్బంది పెట్టాడు. అయినా తగ్గకుండా లక్ష్యసేన్ స్మాష్ లకు ట్రై చేస్తూ, కొన్ని అనవసర తప్పిదాలు చేశాడు. ఎత్తులో వచ్చిన ఏ పాయింట్ ను అక్సెల్ సెన్ వదులుకోలేదు. ఆ స్మాష్ లకు లక్ష్యసేన్ వద్ద సమాధానం లేకపోయింది. రెండో సెట్ ను 21-14తో నెగ్గి, రెండు సెట్లు విజయంతో పారిస్ ఒలింపిక్స్ ఫైనల్ చేరుకున్నాడు అలెక్సెన్. మరో స్వర్ణంపై గురిపెట్టాడు. 


Also Read: బ్రిటన్‌కు షాకిచ్చిన భారత్, పారిస్‌ ఒలింపిక్స్‌ సెమీఫైనల్స్‌ చేరిన హాకీ టీమ్