Julien Alfred wins women’s 100m to claim Saint Lucia’s 1st medal ever at the Olympics: ఒలింపిక్స్(Olympics)లో వంద మీటర్ల పరుగులో పెను సంచలనం నమోదైంది. మహిళల వంద మీటర్ల పరుగులో ఛాంపియన్, స్వర్ణ పతకం గెలుస్తుందన్న షాకారీ రిచర్డ్‌సన్ అంచనాలు తలకిందులయ్యాయి. షాకారీకి దిమ్మతిరిగే షాక్ ఇస్తూ సెయింట్ లూసియాకు చెందిన జూలియన్ ఆల్ఫ్రెడ్(Julien Alfred) స్వర్ణ పతకంతో సత్తా చాటింది. 10.72 సెకన్లలో లక్ష్యాన్ని ముద్దాడిన ఆల్ఫ్రెడ్ కొత్త చరిత్రను సృష్టించింది. షాకారీ రిచర్డ్ సన్ 10.87 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రజతం సాధించగా... అమెరికాకే చెందిన మెలిస్సా జెఫెర్సన్ 10.92లో కాంస్య పతకాన్ని ముద్దాడింది. సెయింట్ లూసియాకు ఇదే తొలి ఒలింపిక్ పతకం కావడం విశేషం. తొలి పతకమే గోల్డ్ మెడల్ రావడం... అదీ అథ్లెటిక్స్‌లో వంద మీటర్ల పరుగులో రావడంతో సెయింట్ లూసియాలో సంబరాలు అంబరాన్ని అంటాయి. ప్రజలు వీధుల్లోకి వచ్చి వేడుకలు చేసుకున్నారు. ఈ పతకం గెలిచిన అనంతరం ఆల్ఫ్రెడ్ కన్నీటి పర్యంతం అయింది. తాను ఇన్నేళ్లు పడ్డ శ్రమకు ఫలితం లభించిందని ఉబ్బితబ్బిబయింది.
ఊపిరి బిగపట్టి చూస్తుండగా
పారిస్‌లో జరిగిన మహిళల 100మీటర్ల రన్ ఫైనల్‌లో షాకారీ రిచర్డ్‌సన్ పైనే అందరి చూపు నిలిచింది. ఫైనల్ ఆరంభానికి ముందు అందరూ ఊపిరి బిగపట్టి చూశారు. ఆరంభంలో కొన్ని మిల్లీ సెకన్ల పాటు షాకారీ ఆధిక్యంలోకి రావడంతో పతకం ఆమెదేనని అంతా ఫిక్సయిపోయారు. అభిమానులు అందరూ ఆ పది సెకన్లు ఊపిరిని బిగపట్టి మరీ చూస్తుండగా... సెయింట్ లూసియా స్పింటర్ ఆల్ఫ్రెడ్ రేసులోకి దూసుకొచ్చింది. ఇక అంతే చూస్తుండగానే లైన్‌ను దాటేసింది. దీంతో గోల్డ్ మెడల్ గెలిచి ఆల్ఫ్రెడ్ కన్నీళ్లు పెట్టుకోగా... తన ఆశలు అడియాసలు అయ్యాయని షాకారీ హతాశురాలైంది. ఆల్ఫ్రెడ్‌కు- షాకారీకి 0.15 సెకన్ల తేడా ఉండడం విశేషం. ఇది ఒలింపిక్స్‌లో అంత చిన్న విషయమేమీ కాదు. ఈ స్వర్ణం గెలుచుకోవడం ద్వారా జూలియన్ ఆల్ఫ్రెడ్.... సెయింట్ లూసియాకు తొలి పతకాన్ని అందించింది. ఈ గెలుపుతో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మహిళగా ఆల్ఫ్రెడ్ నిలిచింది.
ఇది మాములు విజయం కాదు
ఆల్‌ఫ్రెడ్ విజయం సెయింట్ లూసియాలో క్రీడలకు కొత్త ఊపిరి పోస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 23 ఏళ్ల స్ప్రింటర్ ఆల్ప్రెడ్.. సెయింట్ లూసియాకు మొట్ట మొదటి ఒలింపిక్ పతకాన్ని గెలుచుకోవడం ఆ దేశాన్ని అమితంగా ఆనందపరిచింది. సెయింట్ లూసియాలో ఫైనల్‌ను చాలా నగరాల్లో ప్రొజెక్టర్‌లు, తెరలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ప్రదర్శించారు. వారి అంచనాలను అందుకుంటూ ఆల్ఫెడ్ పతకం గెలవడంతో ఆ దేశంలో పండగ వాతావరణం కనిపిస్తోంది. ఆల్‌ఫ్రెడ్ ముగింపు రేఖను దాటినప్పుడు... సెయింట్ లూసియాలో అభిమానుల సంబరాలు మాములుగా కనిపించలేదు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మహిళ తమ దేశపు వాసేనని వారు సగర్వంగా చెప్పుకుంటున్నారు.