Paris Olympic 2024 Archery Results : పారిస్ ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్ల పోరాటం సాగుతోంది. ఆర్చరీ విభాగంలో జరిగిన పోటీల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మహిళల వ్యక్తిగత ఆర్చరీలో రెండు సార్లు ఒలింపిక్ మెడల్స్ గెలిచిన జర్మనీ క్రీడాకారిణి మిచ్చెల్లి క్రొప్పన్‌ను 6-4 తేడాతో దీపికా కుమారి ఓడించారు. దీపికా తొలి రౌండ్‌లోనే ఆధిక్యం సాధించారు. అన్ని 9 పాయింట్లు స్కోరు చేసింది. కీలకమైన దశలో ప్రత్యర్థి మిచ్చెల్లిపై ఆధిపత్యాన్ని సాధించింది. సెకండ్ సెట్‌లో ఇద్దరు ఆర్చర్లు 27 స్కోర్ చేశారు. మూడవ సెట్‌లో దీపికా ఆధిక్యంలో దూసుకెళ్లింది. ఫైనల్ సెట్ దీపికా కుమారి అద్భుత ప్రదర్శనతో క్వార్టర్స్‌కు చేరుకుంది.
మరో ఆర్చర్ భజన్ కౌర్ గట్టిగా ప్రయత్నం చేసినప్పటికీ క్వార్టర్స్‌కు చేరడంలో విఫలమయింది.
అంతకు ముందు జరిగిన ఇరవై ఐదు మీటర్ల పిస్టల్ షూటింగ్‌లో మనుభాకర్ మరో పతకాన్ని తృటిలో కోల్పోయారు. ఇరవై ఐదు మీటర్ల పిస్టల్ షూటింగ్ ఫైనల్లో ఆమె నాలుగో స్థానంలో నిలిచారు. మొదట్లో ఆమె టాప్ త్రీ పొజిషన్‌లో ఉన్నప్పటికీ చివరిలో ఒత్తిడికి గురవడంతో తక్కువ పాయింట్లు సాధించారు. పోటీ పూర్తయ్యే సరికి టాప్ త్రీ పొజిషన్స్ కోసం నలుగురు పోటీలో ఉన్నారు. మను భాకర్ హంగేరీకి చెందిన వెరోనికా మేజర్‌తో 28 పాయింట్లతో సమంగా నిలిచింది. ఐదు-షాట్‌ల షూటాఫ్‌లో, మను భాకర్ రెండుసార్లు గురి తప్పగా, వెరోనికా మేజర్ ఒక్కసారి మాత్రమే గురి తప్పి29 పాయింట్లతో 3స్థానంలో నిలిచి టాప్ 3కి చేరుకుంది. దీంతో మను హ్యాట్రిక్‌ను కోల్పోయి రెండు చారిత్రాత్మక కాంస్య పతకాలతో పారిస్ ఒలింపిక్స్‌ను ముగించింది. షూటింగ్‌లో భారత్ ఇప్పటికే 3 పతకాలను తన ఖాతాలో వేసుకుంది. మను బాకర్ రెండు కాంస్య పతకాలు సాధించగా, స్వప్నిల్ కుశల్ మరో కాంస్య పతకాన్ని సాధించారు. భారత్‌లో రెండు కాంస్యపతకాలు సాధించిన తొలి మహిళగా మను బాకర్ రికార్డు సృష్టించారు.
భారత ఆటగాళ్లు ఒలింపిక్స్‌లో మంచి ప్రదర్శన చూపిస్తున్నారు. కొంత మంది తృటిలో మెడల్స్ కోల్పోతున్నారు. అయితే ఇంకా కీలకమైన విభాగాల్లో ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. గత ఒలింపిక్స్‌లో భారత్‌కు ఏడు పతకాలు వచ్చాయి. ఈ సారి పదికి పైగా పతకాలు వస్తాయని ఆశాభావంతో ఉన్నారు.