Olympic Games Paris 2024 Manu bhaker  :  పారిస్ ఒలింపిక్స్‌లో మనుభాకర్ మరో పతకాన్ని తృటిలో కోల్పోయారు. ఇరవై ఐదు మీటర్ల పిస్టల్ షూటింగ్ ఫైనల్లో ఆమె నాలుగో స్థానంలో నిలిచారు. మొదట్లో ఆమె టాప్ త్రీ పొజిషన్‌లో ఉన్నప్పటికీ చివరిలో ఒత్తిడికి గురవడంతో తక్కువ పాయింట్లు సాధించారు. దీంతో.. నాలుగో స్థానానికి పడిపోయారు. ఇప్పటికే షూటింగ్‌లో రెండు కాంస్య పతకాలను మనుభాకర్ సాధించారు. ఇరవై ఐదు మీటర్ల పిస్టల్ షూటింగ్‌లో దక్షిణ కొరియాకు చెందిన జె.ఐ యంగ్ 37 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో ఫ్రాన్స్‌కు చెందిన షూటర్, మూడో స్థానంలో హంగెరీ షూటర్ ఉన్నారు. రేసు చివరి వరకూ రెండో స్థానంలో ఉన్న మనుభాకర్ చివరికి వచ్చే సరికి వెనుకబడిపోయారు. 28 పాయింట్లలో నాలుగో స్థానంతో సరి పెట్టుకున్నారు. 


 





మన భాకర్ ఇప్పటికే పది మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీలో కాంస్య పతకం సాధించారు. తర్వాత పది మీటర్ల మిక్స్ డ్ పోటీలో సరబ్‌జ్యోత్ సింగ్‌తో కలిసి మరో కాంస్య పతకం సాధించారు. ఇరవై ఐదు మీటర్ల పిస్టల్ అంశంలో గట్టిగా పోరాడినప్పటికీ.. నాలుగో స్థానంతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది.                                                            


పోటీ పూర్తయ్యే సరికి టాప్ త్రీ పొజిషన్స్ కోసం నలుగురు పోటీలో ఉన్నారు.   మను భాకర్ హంగేరీకి చెందిన వెరోనికా మేజర్‌తో 28 పాయింట్లతో సమంగా నిలిచింది. ఐదు-షాట్‌ల షూటాఫ్‌లో, మను భాకర్ రెండుసార్లు గురి తప్పగా, వెరోనికా మేజర్‌ ఒక్కసారి మాత్రమే గురి తప్పి29 పాయింట్లతో 3స్థానంలో నిలిచి టాప్ 3కి చేరుకుంది. దీంతో మను హ్యాట్రిక్‌ను కోల్పోయి రెండు చారిత్రాత్మక కాంస్య పతకాలతో పారిస్ ఒలింపిక్స్‌ను ముగించింది.                                
 
షూటింగ్‌లో భారత్‌ ఇప్పటికే 3 పతకాలను తన ఖాతాలో వేసుకుంది. మను బాకర్‌ రెండు కాంస్య పతకాలు సాధించగా, స్వప్నిల్‌ కుశల్  మరో కాంస్య  పతకాన్ని సాధించారు. భారత్‌లో  రెండు కాంస్యపతకాలు సాధించిన తొలి మహిళగా  మను బాకర్ రికార్డు సృష్టించారు.