Lakshya Sen vs Viktor Axelsen: తన కెరీర్‌లోనే కీలక మ్యాచ్‌కు భారత బ్యాడ్మింటన్ స్టార్‌ లక్ష్యసేన్‌(Lakshya Sen) సిద్ధమయ్యాడు. ఇప్పటికే  ఒలింపిక్స్‌లో సెమీఫైనల్‌ చేరిన తొలి భారత బ్యాడ్మింటన్‌ పురుష ఆటగాడిగా చరిత్ర సృష్టించిన లక్ష్యసేన్‌ ఇప్పుడు పైనల్‌కు చేరుకుని కొత్త చరిత్ర సృష్టించాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు. ఈ విశ్వక్రీడల్లో తనకంటే మెరుగైన ర్యాంక్‌ ఉన్న ఆటగాళ్లను కూడా మట్టికరిపించి సెమీస్‌లో అడుగుపెట్టిన లక్ష్యసేన్‌కు ఇప్పుడే అసలైన సవాల్‌ ఎదురుకానుంది. డెన్మార్క్‌కు చెందిన విక్టర్‌ అక్సెల్‌సెన్‌(Viktor Axelsen)తో లక్ష్య తలపడనున్నాడు. గత రికార్డులన్నీ విక్టర్‌కే అనుకూలంగా ఉన్నా లక్ష్యసేన్ ఈ ఒలింపిక్స్‌లో పోరాడుతున్న విధానం  అద్భుతంగా ఉంది. విజయాన్ని అంత తేలిగ్గా వదులుకోని లక్ష్య... విక్టర్‌కు షాక్‌  ఇస్తే భారత్‌కు మరో పతకం ఖాయమేనట్లే.

 

హోరాహోరీ తప్పదు

ఇద్దరు దిగ్గజ బ్యాడ్మింటన్‌ ప్లేయర్లు తలపడుతున్న మ్యాచ్‌. అదీ ఒలింపిక్స్‌ సెమీ ఫైనల్లో... ఇక ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఓటమిని అంత ఈజీగా అంగీకరించిన లక్ష్యసేన్‌... సుదీర్ఘ మ్యాచ్‌లను సులభంగా ఆడేయగల విక్టర్‌ ముందు నేడు మ్యాచ్‌ జరగనుంది. పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల బ్యాడ్మింటన్ సెమీఫైనల్‌లో లక్ష్య సేన్ డెన్మార్క్‌కు చెందిన విక్టర్ అక్సెల్‌సెన్‌తో తలపడనున్నాడు. చైనీస్ తైపీకి చెందిన చౌ టియెన్ చెన్‌పై మంచి విజయం సాధించిన లక్ష్యసేన్ ...ఈ మ్యాచ్‌లోనూ గెలిచి చరిత్ర సృష్టించాలని చూస్తున్నాడు. 22 ఏళ్ల లక్ష్యసేన్‌ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మొదటి గేమ్‌ను 19-21తో కోల్పోయినప్పటికీ, తర్వాతి రెండు గేమ్‌లను 21-15... 21-12 తేడాతో గెలిచి సెమీఫైనల్స్‌లో అడుగుపెట్టాడు. సెమీఫైనల్లో ఒలింపిక్ ఛాంపియన్ విక్టర్ అక్సెల్‌సెన్‌తో లక్ష్యసేన్‌ తలపడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో లక్ష్యకు బలమైన సవాల్‌ ఎదురుకానుంది. డెన్మార్క్‌కు చెందిన విక్టర్‌ అక్సెల్‌సెన్‌ ఈ ఒలింపిక్స్‌లో సాధికార విజయాలతో సెమీస్‌ చేరాడు. నేపాల్‌కు చెందిన ప్రిన్స్ దహాల్‌పై 21-8, 21-6, ఇజ్రాయెల్‌కు చెందిన మిషా జిల్‌బెర్‌మాన్‌పై  21-9, 21-11, నాట్ న్గుయెన్‌పై 21-13, 21-10 తేడాతో గెలిచి సెమీస్‌ చేరాడు.  క్వార్టర్ ఫైనల్స్‌లో సింగపూర్‌కు చెందిన లోహ్ కీన్ యూపై 21-9, 21-17తో విజయం సాధించాడు. డెన్మార్క్‌ ప్లేయర్ ఇంతవరకూ మ్యాచ్‌ను మూడో సెట్‌కు తీసుకెళ్లలేదంటే అతను ఎంత ప్రభావవంతంగా ఆడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు.

ఇప్పటివరకూ లక్ష్యసేన్‌-విక్టర్‌ ఎనిమిది మ్యాచులు అడగా ఏడింటిలో ఆక్సెల్‌సెన్‌ గెలిచాడు. మార్చి 12, 2022న జరిగిన జర్మన్ ఓపెన్‌లో డానిష్ షట్లర్‌పై సేన్ ఏకైక విజయం సాధించాడు. 

 

పురుషుల బాక్సింగ్‌లో ముగిసిన పోరాటం

ఒలింపిక్స్‌లో పురుషల బాక్సింగ్‌లో భారత ప్రస్థానం ముగిసింది. భారత యువ బాక్సర్‌ నిషాంత్‌దేవ్‌ పోరాటం ముగియడంతో పురుషుల బాక్సర్ల కథ ముగిసింది. ఈ ఒలింపిక్స్‌లో ఒక్క పతకం సాధించకుండా భారత బాక్సర్లు రిక్తహస్తాలతో స్వదేశానికి పయనమయ్యారు. కచ్చితంగా పతకం సాధిస్తాడన్న అంచనాలు ఉన్న నిషాంత్‌.. 71కిలోల క్వార్టర్‌ ఫైనల్‌లో 1-4 తేడాతో మొరాకాకో చెందిన మార్కో వెర్డె చేతిలో పోరాడి ఓడాడు.  పంచ్‌ల వర్షం కురిపించిన నిషాంత్‌ ఓడిపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.