Minister Srinivas Goud : మహబూబ్ నగర్ లో రెండు రోజుల పాటు కేంద్రమంత్రి మహేంద్రనాథ్ పాండే పర్యటించారు. కేంద్ర మంత్రి అవగాహన లేకుండా మాట్లాడారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. కేంద్రమంత్రి జిల్లాకు వచ్చే ముందు జిల్లా పరిస్థితి ఎలా ఉందని తెలుసుకుని వస్తే బాగుండేదన్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం కేసీఆర్ ఏం చేయలేదని  మాట్లాడుతున్నారని, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ మొదటగా అనుమతి ఇచ్చిన విషయం పాండేకు తెలియదా? అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ ఎన్నికలప్పుడు వచ్చి పాలమూరు రంగారెడ్డి పథకంపై ఏమి హామీ ఇచ్చారో కేంద్రమంత్రికి తెలుసా? అని నిలదీశారు. కేసీఆర్ సీఎం అయ్యాకే పాలమూరు జిల్లా దశ మారిందన్నారు. మహబూబ్ నగర్ కు మెడికల్ కాలేజీ కేసీఆర్ ఇచ్చారా? మోదీ ఇచ్చారా? అని ప్రశ్నించారు.  


ఒకరిద్దరు వ్యాపారుల కోసమే బీజేపీ 


మహబూబ్ నగర్ నుంచి వలసలను కేసీఆర్ ఆపారా? మోదీ ఆపారా? బీజేపీ నేతలు కేవలం టూరిస్టుల్లా వచ్చి ఏదేదో మాట్లాడిపోతున్నారు. కేంద్రమంత్రిగా ఉన్న పాండేకు ఈ విషయాల పట్ల కనీస అవగాహన లేదు. నారాయణ పేటకు సైనిక స్కూల్ ఇస్తామని హామీ ఇచ్చారు ఏమైంది. పది లక్షల ఎకరాలకు నీరు పారించింది కేసీఆర్ నా? మోదీనా? బీజేపీ నేతల పిచ్చి మాటలు నమ్మెందుకు ప్రజలు పిచ్చోల్లు కాదు. భారతదేశాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్న పార్టీ బీజేపీ. కేవలం ఒకరిద్దరు వ్యాపార వేత్తల కోసం బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోంది. ఏ వర్గానికి కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయడం లేదు. - మంత్రి శ్రీనివాస్ గౌడ్ 


తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవు 


దేశంలో బీజేపీ ఆటలు ఎక్కడైనా సాగొచ్చు కానీ తెలంగాణలో సాగవని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీజేపీ ప్రశ్నించే గొంతుకలను నొక్కి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని విమర్శించారు. తెలంగాణలో ఏ పథకం చూసినా ఓ రికార్డ్ అన్నారు. కేంద్రంలో ఏ పథకమైనా ప్రజలకు ఉపయోగపడేది ఉందా? అని మంత్రి ప్రశ్నించారు. దళిత బంధు రాబోయే రోజుల్లో బీసీ బంధు గిరిజన బంధు కూడా వస్తాయన్నారు. రాజకీయాల కోసం టీఆర్ఎస్ పుట్టలేదని, ఉద్యమం నుంచి పుట్టిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ కన్నా అద్భుతమైన పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా? దిల్లీ వేదిగ్గా చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ప్రజల గొంతు నొక్కడమా? అని నిలదీశారు. బీజేపీకి దమ్ముంటే పెట్రో ఉత్పత్తుల ధరల పెంపును ఆపాలని సవాల్ విసిరారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలన్నారు.  ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తూ రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్రకు బీజేపీ పాల్పడుతోందని విమర్శించారు. .రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను ఎలా కొనుగోలు చేయాలనేదే బీజేపీ తపన అని, ప్రభుత్వాలను ఎలా కూల్చాలన్నదే బీజేపీ ఆలోచన అని మండిపడ్డారు. 


తెలంగాణపై తోడేళ్ల గుంపులా దాడి 


"మొత్తం దేశంలో తామే ఉండాలనేది బీజేపీ ఆలోచన. దీనికి ప్రజలు తిరుగుబాటు చేస్తారు. బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు తెలంగాణపై తోడేళ్ల గుంపులా దాడి చేస్తున్నారు. పచ్చ బడ్డ తెలంగాణలో రక్తం పారించాలనేదే బీజేపీ ఆలోచన. దేశానికి బీసీ ప్రధాని ఉన్నా బీసీలకు ఏం చేయడంలేదు. బీజేపీకి దమ్ముంటే దళిత బంధును దేశ వ్యాప్తంగా ప్రవేశ పెట్టాలి. బీజేపీ నేతలు తెలంగాణకు వచ్చి భోజనాలు చేసి వెళ్లినంత మాత్రాన ఒరిగేదేమీ లేదు. తెలంగాణ నుంచి కేంద్రం తీసుకోవడమే తప్ప ఇస్తున్నది ఏంలేదు. పాలమూరు రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా ఇవ్వరు కానీ, కర్ణాటకలో అప్పర్ భద్రకు ఇస్తారు. ఇది తెలంగాణపై వివక్ష కాదా? రేషన్ షాపుల దగ్గర మోదీ ఫోటో పెట్టాలనే డిమాండ్ కాదు.  సిలిండర్లపై మోదీ బొమ్మ వేయాలని డిమాండ్ చేయాలి. ప్రధాని మోదీ స్వయంగా పాలమూరు రంగారెడ్డి పథకాన్ని పూర్తి చేస్తామన్నారు. మరి ఎందుకు పట్టించుకోరు"  - మంత్రి శ్రీనివాస్ గౌడ్ 


Also Read : CM KCR : త్వరలోనే జాతీయ రాజకీయాల్లోకి, దేశ వ్యాప్తంగా రైతులందరికీ ఉచిత విద్యుత్ - సీఎం కేసీఆర్