యాభై రూపాయలు పెడితే ఇంత టిష్యూ పేపర్ల కట్ట వస్తుంది. వాటిని ఇలా తుడిచి అలా డస్ట్‌బిన్‌లో విసిరేస్తాం. కానీ ఓ వ్యక్తి ఆన్‌లైన్లో ఓ టిష్యూ పేపర్ కొన్నాడు. దాని ఖరీదు ఎంతో తెలుసా? అక్షరాలా 6.36 లక్షల రూపాయలు. టిష్యూ పేపర్‌ని జాగ్రత్తగా ఫ్రేమ్ కట్టించి మరీ దాచుకోబోతున్నాడట. అంతగా దాని స్పెషాలిటీ ఏంటనుకుంటున్నారా? దానిపై ఓ వ్యక్తి సంతకం ఉంది. అతను ప్రముఖ సింగర్. ఆ సింగర్ ఎవరో తెలుసా? మేము చెప్పినా అతడు మీకు తెలిసే అవకాశం లేదు. కారణం అతడు సౌదీ అరేబియా సింగర్. పేరు మహ్మద్ అబ్దు. ఇతని పాటలంటే చెవి కోసుకుంటారు గల్ఫ్ దేశాల వారు. అతడి షోలు ఉన్నాయంటే ఎగబడిపోతారు. 


కొన్ని రోజుల క్రితం ఆ గాయకుడు సౌదీ అరేబియాలోని అభా నగరంలో ఓ షో ఇచ్చాడు. దానికా ప్రేక్షకులు భారీగా వచ్చారు. ఆ కార్యక్రమంలో ఆయన ఓ టిష్యూ పేపర్ ని వాడి పక్కన పడేశాడు. అలా పడేయడం చాలా మంది ప్రేక్షకులు చూశారు. దాని కోసం ఎగబడిన వాళ్లు కూడా ఉన్నారు. ఇదంతా చూసిన షో నిర్వాహకులు ఆ టిష్యూ పేపర్ తీసి భద్రపరిచారు. తరువాత ఆ పేపర్ సంతకం పెట్టమని గాయకుడిని అడిగారు. మహ్మద్ అబ్ధు సంతకం చేసి అక్కడ్నించి వెళ్లిపోయారు. 


ఇన్‌స్టాల్‌మెంట్లో...
ఆ టిష్యూ పేపర్‌ను అమ్మి డబ్బు సంపాదించాలనుకున్నారు ఆ షో నిర్వాహకులు. ఆన్ లైన్లో దాన్ని అమ్మకానికి పెట్టారు. దాదాపు 30 వేల సౌదీ రియాల్ గా ధరను నిర్ణయించారు. అంటే మన రూపాయల్లో ఆరు లక్షల 36 వేల రూపాయలన్న మాట. దీన్ని కొనాలనుకుంటే ఆ మొత్తం ఒక్కసారే ఇవ్వక్కర్లేదు. నాలుగు ఇన్‌స్టాల్మెంట్లుగా కట్టవచ్చు. ఆయన అభిమానులు ఈ టిష్యూని చూసి ఇదెక్కడ విడ్డూరం అని కామెంట్లు చేశారు. కానీ ఒక అభిమాని మాత్రం కొనేశాడు. అందుకే అంటారు పిచ్చి అభిమానం అని. 



ఇంతకుముందు ప్రపంచం మెచ్చిన సాకర్ ఆటగాడు మెస్సీ కూడా తన ఆటకు గుడ్ బై చెప్పినప్పుడు ఉబికి వస్తున్న కన్నీళ్లను ఓ టిష్యూ పేపర్తో తుడుచుకున్నాడు. ఆ టిష్యూ కూడా వేలంలో ఏకంగా ఏడున్నరకోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. 


తాజాగా ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ ఉపయోగించిన జావెలిన్ ను వేలంలో భారీ ధరకు దక్కించుకుంది బీసీసీఐ. ఏకంగా కోటిన్నర రూపాయలకు కొనుక్కుంది. దీంతో పాటూ భారత పారా ఒలింపిక్ జట్టు సంతకం చేసిన వస్త్రాన్ని కూడా కోటి రూపాయలకు కొనుగోలు చేసి భద్రపరిచింది. ఇలా వచ్చిన డబ్బును ‘నమామి గంగే’ కార్యక్రమానికి విరాళంగా ఇచ్చేశారు.  ఇలా సాధారణ వస్తువులను కూడా వేలంలో లక్షలు, కోట్ల రూపాయలకు అమ్ముడుపోవడం ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది.


Also read: ఇలా కూడా బరువు తగ్గొచ్చా? ఆ ప్రపంచ కుబేరుడు చేసింది మీరూ చేయొచ్చు, ఇదిగో ఇలా!


Also read: అత్యంత పురాతన పిండి మరయంత్రం ఇది, ఆరువందల ఏళ్లుగా తిరుగుతూనే ఉంది