ఎలన్ మస్క్ చేసే ట్వీట్ విలువ ఇంతా అంతాకాదు. ఆయన చేసే ఒక్క ట్వీట్‌తో కోట్ల రూపాయల వ్యాపారాలు కూలిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన తొలిసారి తన ఆరోగ్యానికి సంబంధించిన ట్వీట్ చేశారు. తాను ఇంటర్మెట్టెన్ ఫాస్టింగ్ (Intermitten Fasting) ద్వారా తొమ్మిది కిలోల బరువు తగ్గినట్టు చెప్పారు. దీంతో ఆ ఉపవాస పద్దతేంటో తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇంటర్మిట్టెన్ ఫాస్టింగ్ ద్వారా బరువు తగ్గాలని ఆశిస్తున్నారు. అసలు అదేంటో? ఎలా ఫాలో అవ్వాలో? నిజంగానే ఈ పద్ధతిలో బరువు తగ్గుతారా? అనేది తెలుసుకుందాం. 


ఏంటి ఈ ఫాస్టింగ్?
మనుషులు వేలాది సంవత్సరాలుగా ఉపవాస పద్ధతిని పాటిస్తున్నాం. పుణ్య దినాల్లో ఎక్కువ మంది ఉపవాసం ఉంటారు. మన శరీరం కొంత కాలం పాటూ ఆహారం లేకపోయినా శక్తిని ఉత్పత్తి చేసే నిర్మాణాన్ని కలిగిఉన్నాయి. అయితే ఇప్పుడు ఉపవాసం బరువు తగ్గడం కోసం కూడా చేస్తున్నారు చాలా మంది. అలాంటి ఉపవాసాల్లో ఒకటి  ఇంటర్మిట్టెన్ ఫాస్టింగ్. అంటే అప్పుడప్పుడు ఉపవాసం చేయడం. అంటే నాలుగు రోజులు ఒకసారి, లేదా వారానికి ఒకసారి ఉపవాసం చేయడం. మస్క్ ఎన్ని రోజులకోసారి ఉపవాసం చేశారో చెప్పలేదు కానీ, తొమ్మిది కిలోల బరువు మాత్రం తగ్గారు. ఉపవాసం అనేది శరీరాన్ని శుభ్రపరిచే ఒక విధానం. 


ఎలా చేయాలి?
వారానికి రెండు సార్లు చేయాలి అనుకునే వారు వారంలో రెండు రోజు ఉపవాసం కూడా కేటాయించుకోవాలి. కాకపోతే వరుసగా రెండు రోజులు చేయకూడదు. నెలలో అయిదు రోజులు ఎంచుకుంటే ప్రతి నాలుగు రోజులకోసారి ఉపవాసం చేయాలి. ఆ రోజుల్లో పదహారు గంటల పాటూ ఘనాహారం ఏమీ తీసుకోకుండా ఉండాలి. పదహారు గంటలు గడిచాక ఘనాహారం తీసుకోవచ్చు. అది తేలికపాటి ఆహారం. ఇక ఆ పదహారుగంటల్లో నీళ్లు, కాస్త పండ్ల రసాలు వంటివి తీసుకోవచ్చు. ఇలా ఇంటర్మిట్టెన్ ఫాస్టింగ్ చేయడం వల్ల శరీరంలోని కొవ్వు ఖర్చవడం (ఫ్యాట్ బర్న్) పెరుగుతుంది. 


ఫ్యాట్ బర్న్ లాజిక్ ఏమిటి?
మనం ఆహారం తీసుకున్నప్పుడల్లా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. కొంత గ్లైకోజన్‌గా మారి శరీరంలో కొవ్వుగా పేరుకుపోతుంది. మనం ఎప్పుడైతే ఉపవాసం ఉంటామో అప్పుడు గ్లూకోజ్ కొరత ఏర్పడుతుంది. ఇప్పుడు కొవ్వుగా పేరుకుపోయిన గ్లైకోజన్ కరిగి గుండె, ఇతర అవయవాలకు అందించడం జరుగుతుంది. అంటే ఎక్కువ కాలం ఉపవాసం ఉన్నప్పుడు మన శరీరంలోని కొవ్వు నిల్వలు కరిగిపోతాయి. ఇది కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. 


నిజంగా బరువు తగ్గుతారా?
ఇంటర్మిట్టెన్ ఫాస్టింగ్ వల్ల నిజంగానే బరువు తగ్గుతారు. 
రెండు నుండి మూడు నెలల్లో మూడు నుంచి అయిదు కిలోల వరకు బరువు తగ్గే అవకాశం ఉందని చాలా అధ్యయనాలు నిరూపించాయి. అంతేకాదు ఇలా చేయడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుందని, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్స్ అవుతుందని తెలిపాయి. 


ఎవరూ పాటించకూడదు?
ఇంటర్మిట్టెన్ ఫాస్టింగ్‌ను కొంతమంది పాటించకూడదు. పిల్లలు, యుక్తవయసులో ఉన్నవారు, గర్భిణులు, బాలింతలు, థైరాయిడ్ రోగులు ఈ పద్దతిని పాటించకూడదు. 


Also read: అత్యంత పురాతన పిండి మరయంత్రం ఇది, ఆరువందల ఏళ్లుగా తిరుగుతూనే ఉంది


Also read: మహమ్మారి ఇంకా పోలేదు,ప్రపంచంలో పద్నాలుగు కోట్ల మందికి లాంగ్ కోవిడ్ లక్షణాలు



































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.