కుటుంబ సమస్యలు, వృత్తిపరమైన ఒత్తిళ్లు, ఒంటరితనం, మానసిక రుగ్మతలు, దురలవాట్లకు బానిస కావడం, ఆర్థికపరమైన సమస్యలు. ఇలా కారణమేదైనా ఈరోజుల్లో చాలామంది వెతుక్కునే దారి ఆత్మహత్య చేసుకోవడం. తనువు చాలిస్తే సమస్యలు ఉండవన్న నమ్మకమే, ప్రాణం తీసుకుంటే ఏ సమస్యా ఉండదనే భావనో లేక క్షణికావేశమో తెలియదు కానీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కొందరు. దేశంలో రోజుకు సగటున 450 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అంటే గంటకు 18 మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇవన్నీ కాకి లెక్కలు కావు. క్రైమ్ రికార్డ్స్ ను తయారుచేసే సంస్థ ఎన్సీఆర్బీ ఇచ్చిన నివేదిక ఇది. సూసైడ్ కేసులు నమోదు చేసిన పోలీసుల నుంచి ఈ వివరాలు తీసుకున్నట్లు ఎన్సీఆర్బీ వివరించింది.
పెరిగిన ఆత్మహత్యలు
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(NCRB) నివేదిక ప్రకారం దేశంలో 2021వ సంవత్సరంలో ఆత్మహత్యలు పెరిగాయి. దేశవ్యాప్తంగా మొత్తం 1,64,033 సూసైడ్ కేసులు నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. ఇందులో దాదాపు 1.19 లక్షల మంది పురుషులు, 45,026 మంది మహిళలు, 28 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. 2020తో పోలిస్తే 7.2 శాతం పెరుగుదల ఉంది. అదేవిధంగా ఆత్మహత్యల రేటు 6.2 శాతం పెరిగింది.
సగం మంది ఈ 5 రాష్టాల్లోనే
దేశంలో మహారాష్ట్రలో అత్యధికంగా 22,207 మంది ఆత్మహత్య చేసకున్నారు. ఆ తర్వాత తమిళనాడు (18,925), మధ్యప్రదేశ్ (14,965), పశ్చిమ బెంగాల్ (13,500), కర్ణాటక (13,056) వరుస స్థానాల్లో ఉన్నాయి. దేశం మొత్తం మీద 50.4 శాతం ఆత్మహత్యలు ఈ 5 రాష్ట్రాల్లోనే నమోదయ్యాయని ఎన్సీఆర్బీ నివేదిక తెలిపింది. మిగిలిన 49.6 శాతం కేసులు 23 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో నమోదయ్యాయి. అయితే భారత్ లో అత్యధిక జనాభా కలిగిన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో బలవన్మరణ కేసులు తక్కువగా నమోదయ్యాయి. దేశ జనాభాలో 16.9 శాతం జనాభా కలిగిన యూపీలో 3.6 శాతం మాత్రమే ఆత్మహత్య కేసులు వెలుగుచూశాయి.
కేంద్రపాలిత ప్రాంతాల్లో 2021లో దిల్లీలో అత్యధిక ఆత్మహత్య కేసులు నమోదయ్యాయి. ఇక్కడ 2,840 సూసైడ్ కేసులు రాగా.. పుదుచ్చేరిలో 504 కేసులు వచ్చాయి. 2021లో దేశంలోని 53 ప్రధాన నగరాల్లో 25,891 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది.
ఆత్మహత్య రేటుల్లో 4వ స్థానంలో తెలంగాణ
2021 లో దేశ వ్యాప్తంగా ఆత్మహత్యల రేటు 12 శాతంగా ఉంది. అండమాన్, నికోబార్ దీవుల్లో అత్యధిక ఆత్మహత్య రేటు (39.7) నమోదైనట్లు ఎన్సీఆర్‌బీ రిపోర్ట్ స్పష్టం చేసింది. సిక్కిం (39.2), పుదుచ్చేరి (31.8), తెలంగాణ (26.9), కేరళ (26.9) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.