మనకు ఎవరితో అయినా నిజాయతీతో కూడిన సంబంధాలు ఉంటే.. ఆ బంధంపై ఇరువైపులా నమ్మకముంటుందని భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. తాను టెస్టు కెప్టెన్సీకి వీడ్కోలు చెప్పినప్పుడు ఒకే ఒక్కరు తనకు మెసేజ్ చేశారని తెలిపాడు. ఆ వ్యక్తి ఎమ్మెస్ ధోనీ అని.. తమ మధ్య అలాంటి నమ్మకమైన బంధం ఉందని విరాట్ వివరించాడు. 


ధోనీ ఒక్కడే


ఆదివారం పాక్ తో మ్యాచ్ తర్వాత కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్బంగానే తనకు ధోనీతో ఉన్న బంధాన్ని మరోసారి గుర్తుచేశాడు. తాను టెస్ట్ కెప్టెన్సీ వదిలేసినప్పుడు ధోనీ ఒక్కడే తనకు వ్యక్తిగతంగా మెసేజ్ పంపాడని తెలిపాడు. చాలామంది వద్ద తన ఫోన్ నెంబర్ ఉందని.. అయితే వారెవరు తనకు మెసెజ్‌లు పంపలేదని అన్నాడు. ధోనీ నుంచి తాను ఏమీ ఆశించనని.. అలాగే తన నుంచి ధోనీ ఏమీ ఆశించడని తెలిపారు. తాము ఇద్దరం ఏనాడూ అభద్రతా భావానికి గురికాలేదని వెల్లడించాడు. 


అలాంటి సలహాలే పరిశీలిస్తాను


అందరూ టీవీల్లోనూ, ప్రపంచం మొత్తానికి తెలిసేలా తనకు సలహాలు ఇస్తున్నారని.. అలాంటి వాటికి తనవద్ద విలువ ఉండదని విరాట్ అన్నాడు. తనతో ఎవరైనా వ్యక్తిగతంగా  మాట్లాడి సలహాలు ఇస్తే వాటిని తాను పరిశీలిస్తానని స్పష్టంచేశాడు. మనం ఎంత బాగా ఆడినా ఫలితం దేవుడి చేతుల్లోనే ఉంటుందని వ్యాఖ్యానించాడు. 


తప్పులు సహజం


నిన్నటి మ్యాచ్ లో అర్హదీప్ క్యాచ్ వదిలేయడంపైనా విరాట్ స్పందించాడు. అలాంటి ఉత్కంఠభరిత క్షణాల్లో తప్పులు ఎవరైనా చేస్తారని.. వాటిని సరిదిద్దుకుని ముందుకు వెళ్లడమేనని అన్నాడు. అతను యువకుడని, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడని అర్హదీప్ కి మద్దతుగా మాట్లాడాడు. సీనియర్లు ఎప్పుడూ కుర్రాళ్లకు అండగా ఉంటారని స్పష్టంచేశాడు. 


వారిద్దరూ గేమ్ ఛేంజర్లు


అలానే సూర్యకుమార్, పాండ్యను వెనకేసుకొచ్చాడు. ఒక్క మ్యాచ్ లో సరిగ్గా ఆడనంత మాత్రాన వారి ప్రతిభను అనుమానించక్కరలేదని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2022 నుంచి పాండ్య ఆటలో మార్పు కనపడుతోందని అన్నాడు. ఒక నిఖార్సయిన ఆల్ రౌండర్ గా తనని తాను మలుచుకున్నాడని అభినందించాడు. ఇకపోతే సూర్యకుమార్ ఒకసారి ఆడడం మొదలుపెడితే ప్రత్యర్థి నుంచి మ్యాచును లాగేసుకుంటాడని ప్రశంసించాడు. తమ తప్పులు దిద్దుకుని ఆసియా కప్ తర్వాతి మ్యాచులో విజయం సాధించడానికి ప్రయత్నిస్తామని తెలిపాడు. 


ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియాపై పాకిస్థాన్ ఐదు వికెట్లతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. అనంతరం పాకిస్తాన్ 19.5 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది.