Kabul Blast:


కాబూల్‌లో పేలుడు 


అఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్‌లో భారీ పేలుడు సంభవించింది. రష్యా ఎంబసీ పరిసరాల్లో దరుల్ అమన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 20 మృతి చెందారు. అఫ్గానిస్థాన్‌లోని టోలో న్యూస్‌ ఈ ప్రాథమిక వివరాలు వెల్లడించింది. ఇటీవలే హెరట్ ప్రావినెన్స్‌లోనూ ఇదే తరహాలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. మసీదులో పేలుడు సంభవించగా...18 మంది మృతి చెందారు. 21 మంది గాయపడ్డారు. ఆ మసీదు ఇమామ్ మావల్వి ముజీబ్ రహమాన్ అన్సారీ ఈ పేలుడులో మృతి చెందినట్టు టోలో న్యూస్ వెల్లడించింది. శుక్రవారం మసీదులో ప్రార్థనలు చేసుకునే సమయంలో ఆత్మాహుతి దాడి జరిగినట్టు స్పష్టం చేసింది. ఈ మధ్య కాలంలో అఫ్గానిస్థాన్‌లో ఈ తరహా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అంతకు ముందు కూడా అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో ఓ మసీదు వద్ద పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 20 మంది చనిపోగా...40 మంది గాయపడ్డారు. సాయంత్రం ప్రార్థనలు చేసుకునే సమయంలో ఖాయిర్ ఖానాలో బాంబు పేలింది. "కాబూల్‌కు ఉత్తర ప్రాంతంలోని ఓ మసీదులో బాంబు పేలిన ఘటనలో 20 మంది మృతి చెందారు. 40 మంది గాయపడ్డారు" అని అఫ్గాన్‌ సెక్యూరిటీ సోర్స్ వెల్లడించింది. తాలిబన్లు అఫ్గాన్‌ను వశం చేసుకుని ఏడాది కావస్తున్నా...సాధారణ పౌరులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులనూ టార్గెట్ చేస్తూ ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. 


తాలిబన్ల పాలనకు ఏడాది 


అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల పాలనకు ఏడాది పూర్తైంది. ప్రజాస్వామ్యం నుంచి ఇస్లామిక్ వాదుల పాలనలోకి జారిపోయిన ఈ ఏడాది కాలంలో దేశం ఆర్థికంగా పతనమైంది. అంతర్జాతీయంగానూ ఒంటరిగా మిగిలింది. పరిపాలనాపరమైన ఎన్ని సవాళ్లు ఉన్నా పట్టని తాలిబన్లు... ఏడాది పాలనకు గుర్తుగా వీధుల్లో మోటారు వాహనాలపై తిరుగుతూ ఎక్కడికక్కడ ర్యాలీలు నిర్వహించారు. అమెరికా రాయబార కార్యాలయం ఉన్నచోట కొందరు ‘డెత్‌ టు అమెరికా’అంటూ నినాదాలు చేశారు.అఫ్గాన్‌ పగ్గాలు తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన తర్వాత ఆ దేశం పరిస్థితి 
అస్తవ్యస్తమైంది. ఆర్థిక పతనానికి తోడు విదేశీ సాయం కూడా మందగించింది. లక్షల మంది పేదరికంలోకి జారుకున్నారు. తాలిబన్‌ పాలకులను ఏ దేశమూ గట్టిగా విశ్వసించకపోవడంతో... అంతర్జాతీయంగా అఫ్గాన్‌ ఒంటరిగా మారింది. అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గి... బాలికలు, మహిళలు చదువుకోవడానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి ఇబ్బంది కలిగించబోమని తాలిబన్లు మొదట్లో హామీఇచ్చారు. తర్వాత ఆ విషయాన్ని పట్టించుకోవడం మానేశారు. యుక్తవయసు పిల్లలు ఇప్పుడు విద్యాసంస్థల్లో చదువుకోలేని పరిస్థితి నెలకొంది. మహిళలు బహిరంగ ప్రదేశాల్లోకి రావాలంటే నడినెత్తి నుంచి అరికాళ్ల వరకూ బురఖా ధరించాల్సిందే. చాలామంది తమ ఇళ్లలోని ఆడపిల్లల చదువులు ఆగిపోకూడదని ప్రత్యామ్నాయ మార్గాల్లో వారికి విద్యను చెప్పిస్తున్నారు. బాలికల కోసం అక్కడక్కడ రహస్య, భూగర్భ పాఠశాలలు వెలిశాయి.