Rishi Sunak vs Liz Truss: 


లిజ్ ట్రస్‌ వైపు మొగ్గు..? 


బ్రిటన్ ప్రధాని ఎవరో నేడు తేలిపోనుంది. బోరిస్ జాన్సన్ రాజీనామా తరవాత ఎవరు ఆ కుర్చీలో కూర్చుంటారా అన్న ఉత్కంఠకు తెరపడనుంది. భారత సంతతికి చెందిన రిషి సునక్, లిజ్‌ ట్రస్‌ ఈ రేసులో ఉన్నారు. మొదట్లో అంతా సుకన్‌వైపు మొగ్గు చూపినట్టు కనిపించినా...తరవాత లిజ్‌ ట్రస్‌కే అందరూ మద్దతు తెలిపారు. దశలవారీగా జరిగిన ఓటింగ్‌లలో రిషి సునక్ కాస్త వెనకబడ్డారు. కన్జర్వేటివ్
సభ్యులు...లిజ్ ట్రస్‌ ప్రధానిగా ఉండాలని కోరుకుంటున్నారు. ఒకవేళ తుది ఫలితాల్లో ఆమే గెలిచినట్టు తేలితే...బ్రిటన్‌కు మూడో మహిళా ప్రధానిగా రికార్డు సృష్టించనున్నారు. ఒకవేళ రిషి సునక్‌ విజయం సాధిస్తే.. శ్వేతజాతియేతర తొలి ప్రధానిగా చరిత్రకెక్కుతారు. అయితే... ఇటీవల చేసిన కొన్ని సర్వేలు...లిజ్ ట్రస్‌కే ప్రధాని అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేల్చి చెప్పాయి. బ్రిటీష్ ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ బేస్డ్‌ మార్కెట్ రీసెర్చ్ సంస్థ అయిన యూగవ్‌ రిపోర్ట్‌ ఇందుకు ఉదాహరణ. 19 పాయింట్ల తేడాతో ట్రస్, రిషి సునక్‌ను అధిగ మిస్తారని గత వారమే అంచనాలు వచ్చాయి. ఈ సర్వే ప్రకారం...730 మంది కన్జర్వేటరీ పార్టీ సభ్యుల్లో 62% మంది తాము ట్రస్‌కు ఓటు వేసినట్టు చెప్పగా, 38% మంది మాత్రమే రిషి సునక్‌కు ఓటు వేసినట్టు వెల్లడించారు. ఇలా చూసుకుంటే 24% మేర ట్రస్‌ లీడ్‌లో ఉన్నట్టేనని అప్పుడు అంతా లెక్కలు వేసుకున్నారు. 


ద్రవ్యోల్బణం..


బోరిస్ జాన్సన్ ప్రధానిగా ఉన్నప్పుడు రిషి సునక్ ఆర్థిక మంత్రిగా వ్యవహరించారు. ఉన్నట్టుండి సునక్ ఆ పదవికి రాజీనామా చేశారు. దేశ ఆర్థిక స్థితిగతులు దారుణంగా ఉన్న సమయంలో ఆర్థిక మంత్రి పదవి నుంచి తప్పుకోవటం పట్ల ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. అంతే కాదు. బోరిస్ జాన్సన్ ప్రధాని పదవికి రాజీనామా చేయాలనే ఉద్దేశంతోనే...సునక్ ఆర్థిక మంత్రి పదవి నుంచి తప్పుకున్నారన్న ఆరోపణలూ తీవ్రంగానే వచ్చాయి. అటు ప్రజల్లోనూ అసహనం వ్యక్తమవుతోంది. ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. జనవరితో పోల్చుకుంటే...ఇప్పటికే నిత్యావసరాల ధరలు 80% మేర పెరిగాయి. రానున్న చలికాలంలో ఇళ్లను వెచ్చగా ఉంచుకునేందుకు కాస్త భారీగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ వింటర్‌ను ఎలా దాటాలో..? అన్న భయం అక్కడి ప్రజల్లో మొదలైంది. జులైలో బోరిస్ జాన్సన్ ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. ఆయనపై ఎన్నో అవినీతి ఆరోపణలొచ్చాయి. కరోనా సంక్షోభాన్ని సరిగా డీల్ చేయలేదన్న విమర్శలూ ఉన్నాయి. ఇప్పుడీ ఛైర్‌లో కూర్చుకునేందుకు రిషి సునక్, లిజ్ ట్రస్ పోటీ పడుతున్నారు. నేటి సాయంత్రం 5.30 గంటల వరకూ బ్రిటన్ ప్రధాని ఎవరన్నది తేలిపోతుంది. ప్రధాని ఎవరైనా సరే...ఎన్నో సవాళ్లు స్వాగతం పలకనున్నాయి. ముఖ్యంగా...ద్రవ్యోల్బణాన్నితగ్గించటం ఇందులో కీలకమైంది. అటు రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం నుంచి బయట పడటం మరో ముఖ్యమైన అంశం. మొత్తానికి...దేశాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు నడిపించాల్సిన బాధ్యతను కొత్త ప్రధాని తీసుకోక తప్పదు. 


Also Read: Asia Cup, Ind vs Pak: పాకిస్థాన్ అభిమానిని ట్రోల్ చేసిన ఇర్ఫాన్ పఠాన్, అంతలోనే సీన్ రివర్స్