తన ఫోన్‌లో కనిపించిన ఓ డేటింగ్ యాప్ లింక్ ను క్లిక్ చేశాడు. పాపం.. అదే అతడి పాలిట శాపంగా మారింది. ఒక్క సెకన్ లో క్లిక్ చేసిన ఆ లింక్ వల్ల దాదాపు రెండేళ్లుగా నరకయాతన అనుభవిస్తూనే ఉన్నాడు. లింక్ క్లిక్ చేయగానే ఆన్ లైన్ కి వచ్చిన ఓ అమ్మాయి.. మాటలతో నమ్మించి అతడి నగ్రన చిత్రాలను సేకరించింది. వాటిని పట్టుకొని అతడి వద్ద నుంచి దఫదపాలుగా 2.18 లక్షల డబ్బును దోచేశారు. అంతే కాదండోయ్ వ్యభిచార వెబ్ సైట్లలో అతని ఫోన్ నెంబర్ కూడా పెట్టారు. రెండేళ్లుగా వాళ్లు పెడ్తున్న బాధలను తట్టుకోలేక సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


అసలేం జరిగిందంటే..?


32 ఏళ్ల వయసున్న ఓ ప్రైవేటు ఉద్యోగి మియాపూర్ లో నివాసం ఉంటాడు. అతడికి భార్యా, పిల్లలు కూడా ఉన్నారు. అయితే 2020వ సంవత్సరం ఆగస్టు నెలలో ఇతడు... లొకాంటో అనే పేరుతో ఉన్న డేటింగ్ యాప్ లింక్ క్లిక్ చేశాడు. అంతే వెంటనే శృతి అనే అమ్మాయి పేరుతో సైబర్ నేరగాళ్లు చాటింగ్ ప్రారంభించారు. మరో అమ్మాయిలా మోక్షలాగా కూడా పరిచయం చేసుకున్నారు. ప్రేమిస్తున్నాం, డేటింగ్ చేద్దాం, నీ నగ్న ఫొటోలు పంపు అంటూ.. కోరేవారు. ఇతడూ వాళ్లపై ఆసక్తి చూపించి తన నగ్న ఫొటోలను వారిద్దరికీ పంపాడు. ఇక అప్పటి నుంచి వాళ్లు బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే... నగ్న చిత్రాల స్క్రీన్ షాట్లను భార్య, కుటుంబ సభ్యులతోపాటు బంధుువులు, స్నేహితులకు పంపుతామని బెదిరించారు. అంతే కాదండోయ్ మీ ఇంటికి వస్తామంటూ, కుటుంబాన్ని మొత్తం చంపేస్తామంటూ తీవ్రంగా భయపెట్టారు. 


బాధితుడి ఫోన్ నెంబర్ ను వ్యభిచార వెబ్ సైట్ లో పెట్టి..


వాళ్ల వేధింపులు తట్టుకోలేక వాళ్ల ఫోన్ లను బ్లాక్ లో పెట్టేవాడు. ఇలా ఎన్నిల నెంబర్లు పెడితే అన్ని కొత్త నెంబర్ల నుంచి అతడు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టేవారు. ఇలా దాదాపు 70 నుంచి 100 వేర్వేర నెంబర్లతో అతనికి ఫోన్లు వచ్చాయి. ఇది చాలదన్నట్లుగా.. అతని ఇన్ స్టాగ్రామ్ ఖాతాను కూడా హ్యాక్ చేశారు. ఇతర వివరాలు సేకరించి వారికి వ్యక్తిగత సమాచారాన్ని పంపారు. అంతటితో ఆగకుండా ఫోన్ నెంబర్ ను వ్యభిచారానికి సంబంధించిన వెబ్ సైట్లలో ఉంచారు. దీంతో అతడికి ఫోన్లు రావడం మరింత పెరిగింది. లోన్ యాప్ ల నుంచి తీసుకున్న రుణాన్ని చెల్లించాలంటూ కొందరు ఫోన్ చేసి డిమాండ్ చేశారు. గూగుల్ ఫే, ఫోన్ పే, పేటీఎం, బ్యాంకు ఖాతాల నుంచి దాదాపు మూడు దఫాలుగా మొత్తం 2.18 లక్షల రూపాయలను దోచేశారు. 


ఇక వీరి వేధింపులు తట్టుకోలేని బాధిత యువకుడు సైబారాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులును ఆశ్రయించాడు. పాజిటివ్ గా స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని.. ముక్కూ, మొహం తెలియని వాళ్లకు డబ్బులు పంపించకూడదని.. ఏదైనా సమస్య వచ్చిన వెంటనే తమను ఆశ్రయించాలని కోరారు. అప్పుడే ఎవరూ నష్టపోకుండా చూస్కోగలం అని తెలిపారు.