Minister Satyavathi Rathod : టీఆర్ఎస్ ప్రభుత్వంపై గవర్నర్ తమిళి సై సంచలన కామెంట్స్ చేశారు. గవర్నర్ ఆఫీస్ ను రాష్ట్ర ప్రభుత్వం చులకనగా చూస్తోందని, తీవ్రమైన వివక్ష చూపిస్తోందని విమర్శించారు. రాజ్ భవన్ ఏమైనా అంటరాని స్థలమా? అని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు ఇక్కడికి రావడం లేదని గవర్నర్ నిలదీశారు. ప్రొటోకాల్ విషయంలోనూ వివక్ష చూపిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ వ్యాఖ్యలపై మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. 


మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ 


గవర్నర్ తమిళి సై బీజేపీ నాయకురాలిగా మాట్లాడుతున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ తన బాధ్యత నిర్వర్తించాలి కానీ ప్రభుత్వంపై అనవసర వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. సీఎం కేసీఆర్ రాజ్ భవన్ కు ఎప్పుడు వెళ్లాలన్నది ఆయన ఇష్టమని, గవర్నర్ తన పరిధి దాటి బీజేపీ ప్రతినిధిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. వరదలు సంభవిస్తే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉండగా గవర్నర్ ఏం పని పరామర్శలు చేయడానికి అని ప్రశ్నించారు. తెలంగాణ చరిత్ర గవర్నర్ కు తెలియదని, అందుకే విమోచనం అంటున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కు మహిళల పట్ల చాలా గౌరవం ఉందన్నారు. గవర్నర్ స్థాయిని మర్చిపోయి మాట్లాడుతున్నారన్నారు. గత గవర్నర్లతో రానీ సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చిందో చెప్పాలన్నారు. ఎవరికి ఎవరూ దూరమయ్యారో గవర్నర్ ఆలోచించాలని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. 


గవర్నర్ ఆవేదన వ్యక్తం చేయడం బాధాకరం 


"రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది.  రాష్ట్రంలో పాలన సరైన విధంగా లేదని గవర్నర్ కామెంట్స్ చేశారు. రాజ్యాంగం ప్రకారం ఎన్నో అధికారాలు ఉన్న వ్యక్తి అసహనం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది. విచ్చలవిడి తనం పెరిగింది. సీఎం కేసీఆర్ గత గవర్నర్ నరసింహన్ కాళ్లు మొక్కారు.  స్వయానా గవర్నర్ సరైన ప్రోటోకాల్ ఇవ్వడం లేదని, గౌరవం ఇవ్వడం లేదని ఎన్నో సార్లు చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి.  గవర్నర్ కే అవమానాలు కలుగుతుంటే ప్రజల పరిస్థితి అర్థం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మధ్య లోపయికార ఒప్పందాలు ఉన్నాయి. రెండు పార్టీలు వేరు కాదు. గవర్నర్ కు అవమానం కలుగుతుంటే కేంద్రం ఎందుకు స్పందించడం లేదు. ఇది చూస్తే పూర్తిగా అర్థం అవుతుంది. కేసీఆర్, అమిత్ షా, మోదీ అంత ఒక్కటే. గవర్నర్ ఆవేదన వ్యక్తం చేయడం బాధాకరం." -టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్


గవర్నర్ కామెంట్స్ 


తెలంగాణ ప్రభుత్వం పైన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి అసంతృప్తికర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ఆఫీసును ప్రభుత్వం చులకనగా చూస్తోందని, తీవ్రమైన వివక్ష చూపిస్తోందని విమర్శించారు. రాజ్ భవన్ ఏమైనా అంటరాని స్థలమా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు ఇక్కడికి రావడం లేదని నిలదీశారు. ఒక మహిళను అవమానించిన ప్రభుత్వంగా ముద్ర పడకూడదని అన్నారు. రాష్ట్ర గవర్నర్ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలియాల్సి ఉందని చెప్పారు. తాను తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు తీసుకొని మూడేళ్లు పూర్తయి నాలుగో ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా రాజ్ భవన్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి, హోంమంత్రిత్వశాఖకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రజల మద్దతు, సహకారం ఇలాగే కొనసాగాలని కోరారు. గవర్నర్ గా ఈ మూడేళ్ల కాలం తనకు ఎంతో సంతృప్తి ఇచ్చిందని అన్నారు.


Also Read : Tamilisai: మహిళను అవమానించొద్దు, నిజాలన్నీ ప్రజలకు తెలియాలి - కొన్ని చెప్పుకోలేను: గవర్నర్


Also Read : Nizamabad News: నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ లో మూడు ముక్కలాట- నలిగిపోతున్న కేడర్