ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో.. అప్రమత్తమైన అధికారులు జలాశయం 10 గేట్లను 12 ఆడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడం వల్ల కృష్ణ ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. జూరాల నుంచి 2,03,739 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 1,66,707 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండడంతో 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. గంట గంటకు ఇన్ ఫ్లో పెరగడంతో నిన్నటి వరకు జలాశయం 3 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. వరద ఎక్కువవడంతో ఈరోజు 10 రేడియల్ క్రేస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.


ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 3,70,446 క్యూసెక్కులు ఉండగా.. 10 గేట్ల ద్వారా ఔట్ ఫ్లో 3,18,410 క్యూసెక్కులుగా ఉంది. అలానే కుడి, ఎడమ కాలువల నుంచి జల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 62,406 క్యూసెక్కులు మొత్తంగా జలాశయం ఔట్ ఫ్లోగా 3,70,466 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే శ్రీశైలం జలాశయం పూర్తిస్దాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.60 అడుగులుగా ఉంది. అలానే జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 213.4011 టీఎంసీలుగా ఉంది.


అప్రమత్తమైన అధికారులు.. 


ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుండడంతో డ్యాం పరిసర ప్రాంతాల ప్రజలను, దిగువన ఉన్న  ప్రాంతాల ప్రజలను నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. వరద కాలువ వైపు ఎవరూ రాకూడదని హెచ్చరిస్తున్నారు. 


శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి వివరాలు..!


శ్రీశైలం ప్రాజెక్టు ఏపీలోని కృష్ణా నదిపై నిర్మించిన భారీ బహుళార్థసాధక ప్రాజెక్టు. కేవలం జలవిద్యుత్తు ప్రాజెక్టుగానే ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు, తర్వాత కాలంలో నీటిపారుదల అవసరాలను కూడా చేర్చడంతో బహుళార్థసాధక ప్రాజెక్టుగా మారింది. తరువాత కాలంలో ప్రాజెక్టు పేరును నీలం సంజీవరెడ్డి సాగర్ ప్రాజెక్టుగా మార్చారు. 2009 అక్టోబరు 2న ప్రాజెక్టు చరిత్రలోనే అత్యధికంగా 26 లక్షల క్యూసెక్కుల వరద జలాశయంలోకి ప్రవేశించింది. భారీ వరదనీటితో ప్రాజెక్టు సామర్థ్యం కంటే 10 అడుగులపై నుంచి నీరు ప్రవహించింది. 


శ్రీశైలం డ్యామ్ మొత్తం పొడవు 512 మీటర్లు కాగా.. క్రెస్టు గేట్ల సంఖ్య 12. జలాశయం పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 263 టీఎంసీలు. ఇందులో వాడుకోగలిగే నీరు 223 టీఎంసీలు. కుడిగట్టు విద్యుత్ కేంద్రం మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 770 మెగావాట్లు కాగా... యూనిట్ల సంఖ్య 7x110 మెగావాట్లు. ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం భూగర్భంలో నిర్మించారు. జపాన్ ఆర్థిక సాయంతో నిర్మించిన ఈ కేంద్రం దేశంలోనే అరుదైనదిగా చెప్పుకుంటారు. మెగా ఉత్పత్తి సామర్థ్యం 900 మెగా వాట్లు కాగా.. యూనిట్ల సంఖ్య 6x150 మెగావాట్లు.