కడప జిల్లా జమ్మలమడుగు పట్టణ పరిధిలోని పెన్నా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గండికోట జలాశయానికి పెన్నా, చిత్రావతి నదుల నుంచి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో గండికోట జలాశయంలో 26 టీఎంసీలు నీటిని నిలువ ఉంచి.. మిగిలిన నీటిని మైలవరం జలాశయానికి విడుదల చేస్తున్నారు అధికారులు. మైలవరం జలాశయంలో 2.5 టీఎంసీల నీటిని నిల్వ ఉంచి, 30 వేల క్యూసెక్కుల నీటిని పెన్నా నదికి విడుదల చేయడంతో.. పలు గ్రామాల ప్రజల రాకపోకలు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా జమ్మలమడుగు - ముద్దనూరు రహదారిలో గత సంవత్సరం పెన్నా వంతెన 16 వ పిల్లర్ కూలిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అప్పటి నుంచి నేటికి పనుల మరమ్మతులు సాగుతూనే ఉన్నాయి. నేటికి వంతెన పనులు పూర్తి కాలేదు. అత్యవసర రవాణా నిమిత్తం అప్రోచ్ రోడ్డు వేసినప్పటికీ.. వరద నీరు ఎక్కువవడంతో అది కూడా కొట్టుకుపోయింది. 


దాదాపు 14 గ్రామాలకు రాకపోకలు బంద్.


జమ్మలమడుగు - ముద్దనూరు మధ్య రహదారి తెగిపోవడంతో అధికారులు రాకపోకలను నిలిపి వేశారు. దీని వల్ల జమ్మలముుగు నుంచి దాదాపు 14 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయు. ఏదైనా అత్యవసర పని ఉండే వెళ్లాలంటే సుమారు 20 కిలో మీటర్ల తిరిగి వెళ్లాల్సి వస్తుంది. అంతే కాకుండా ప్రొద్దుటూరు నుండి పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయినట్లు తెలుస్తుంది.


అధికారుల నిర్లక్ష్యం వల్లే..


పాలకులు, అధికారుల నిర్లక్ష్యం, అలసత్వం వల్ల ప్రజలు ప్రతి ఏటా ఇబ్బందులు పడుతున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరం పూర్తవుతున్నా పెన్నా నది వంతెనపై రెండు పిల్లర్లు కూడా నిర్మించలేకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సీఎం సొంత జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదని అంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల 14 గ్రామాల ప్రజల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. ఏవైనా ప్రమాదాలు వచ్చి ఆస్పత్రికి వెళ్లాలన్నా సమయానికి వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పనులను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 


శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తివేత..


ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో.. అప్రమత్తమైన అధికారులు జలాశయం 10 గేట్లను 12 ఆడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడం వల్ల కృష్ణ ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. జూరాల నుండి 2,03,739 క్యూసెక్కులు, సుంకేసుల నుండి 1,66,707 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండడంతో 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. గంట గంటకు ఇన్ ఫ్లో పెరగడంతో నిన్నటి వరకు జలాశయం 3 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. వరద ఎక్కువవడంతో ఈరోజు 10 రేడియల్ క్రేస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.