Hyderabad News : దసరాకు వరుస సెలవులు రావడంతో హైదరాబాద్ నుంచి కుటుంబం సహా చాలా మంది సొంతూర్లకు వెళ్తున్నారు. ఇలా సొంతూర్లకు వెళ్లే వారికి సైబరాబాద్ పోలీసులు కీలక సూచనలు చేశారు. ఊరికి వెళ్తున్నామని, కుటుంబంతో లాంగ్ టూర్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దని సైబరబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సూచించారు. పొరపాటున ఇలా పోస్టులు పెడితే దొంగలకు క్లూ ఇచ్చినట్లే అన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పసిగట్టి ఇళ్లలో చోరీలకు పాల్పడవచ్చని పోలీసులు హెచ్చరించారు. నేరస్తులు కూడా సోషల్ మీడియా ఫాలో అవుతూ ఊరెళ్లిన వారి ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్నట్లుగా సీపీ తెలిపారు. దసరాకు సొంతూరికి వెళ్లే వారికి సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పలు సూచనలు చేశారు.
పోలీసుల సూచనలు
- పండగకు ఊరు వెళితే, ఆ విషయాన్ని స్థానిక పోలీసుస్టేషన్‌లో సమాచారం ఇవ్వాలి.
- బంగారు, వెండి, నగదును బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలి. లేదా ఇంట్లో రహస్య ప్రదేశంలో దాచుకోవాలి.
- ఇళ్లలో సీసీ కెమెరాలు అమర్చి, వాటి డీవీఆర్‌లు బయటకు కనిపించకుండా సీక్రెట్ ప్లేస్ లో పెట్టాలి.
- సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పరిశీలిస్తూ ఉండాలి.
- ఇళ్లలో సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సార్లను ఏర్పాటు చేసుకోండి.
- మీరు ఉండే కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100 నంబర్ కు ఫోన్ చేయాలి. లేదా 9490617444 కు వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వాలి.
- నమ్మకమైన వాచ్‌మెన్‌లను సెక్యూరిటీకి పెట్టుకోవాలి. సీసీకెమెరాలతో నిత్యం ఆన్‌లైన్‌లో పరిశీలిస్తుండాలి.
- ఇంటికి తాళం వేసినా కనిపించకుండా కర్టెన్లు ఉంచాలి. ఇంటి లోపల, బయట కొన్ని లైట్లు వేయాలి. ఇంటిని గమనిస్తూ ఉండాలని ఇరుగుపొరుగు వారికి చెప్పాలి.
- కాలనీల్లో దొంగతనాలు అరికట్టేందుకు స్వచ్ఛందంగా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి.
Also Read : Nizamabad News: ఆ ఊరిలో తొలి మొక్కులు గాంధీజీకే- అనాధిగా వస్తున్న ఆచారం
Also Read : CM KCR Janagama Tour: కేసీఆర్ పర్యటనలో అపశృతి, కాన్వాయ్ నుండి జారిపడ్డ మహిళా కానిస్టేబుల్