గాంధీజి అంటే ఇష్టపడని వారు ఉండరు. కానీ బాపూజీ నీ దేవునితో సమానంగా భావించి నిత్య పూజలు జరిపే గ్రామం ఒకటి ఉంది. గాంధీజి అంటే ఆ గ్రామస్తులకు ఎంతో ఇష్టం. స్వాతంత్ర భారతం కోసం ఆయన చేసిన త్యాగాలు, ఆయన చూపిన మార్గాలు ఆ గ్రామస్తులను ఎంతగానో ప్రభావితం చేశాయి. అందుకే తరతరాలుగా బాపూజీ నీ దేవునితో సమానంగా కొలుస్తారు ఆ ఊరి ప్రజలు. కేవలం గాంధీ జయంతి నాడో, స్వాతంత్ర దినోత్సవం రోజో గాంధీజీ సేవలను స్మరించుకుని ఊరుకోరు. ప్రతి నిత్యం గాంధీజీనీ తలుచుకుంటూ ప్రత్యేక పూజలు చేస్తారు. ఊర్లో ఏ శుభకార్యం ఉన్నా, పండగలు ఉన్న బాపూజీకే తొలిపూజలు చేయటం ఈ ఊరి ప్రత్యేకత.
గాంధీజీకి పూజలు చేసిన తరువాతనే దేవతలకు పూజ చేసి శుభకార్యాలు ప్రారంభిస్తారు. తరతరాలుగా ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల అలవాట్లు ఆచారాలు మారుతున్నాయ్. టెక్నాలజీతో పరుగులు పెడుతున్న ఈ రోజుల్లో సంప్రదాయాలు మరుగున పడుతున్నాయ్. కానీ ఆ గ్రామం మాత్రం అనాధిగా వస్తున్న ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. ఓ మహాత్ముడికి తొలి పూజ చేయనిదే ఆ గ్రామంలో ఏ శుభకార్యం జరగదు.
నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గంలోని నర్సింగ్ పూర్ గ్రామస్తులు అనాధిగా వస్తున్న ఆచారాన్ని ఫాలో అవుతున్నారు. అందరూ అక్టోబర్ 2 వచ్చిందంటే గ్రామాల్లో గాంధీ జయంతి సంబరాలు ఘనంగా జరుపుతారు. కానీ నర్సింగ్ పూర్ గ్రామంలో మాత్రం ఏ శుభకార్యం జరిగినా గాంధీజీకి పూజలు చేయటం అనావాయితీగా వస్తోంది. నర్సింగ్ పూర్ లో నర్సింహస్వామి ఆలయం ఉంటుంది. అందుకే ఈ గ్రామానికి నర్సింగ్ పూర్ అని పేరు వచ్చింది. ఆ గ్రామంలోని నర్సింహ స్వామికి పూజలు చేసే గ్రామస్థులు ఊళ్లో ఏ శుభకార్యం జరిగినా తొలి దైవంగా మహాత్మా గాంధీని కొలుస్తారు.
మహాత్మా గాంధీని ఈ గ్రామస్థులు ఏ శుభకార్యం జరిగినా ఎందుకు ఆయన్ను పూజిస్తారు. ఈ అఛారం ఎలా వచ్చిందన్న విషయాలు చాలా ఆసక్తి కలిగిస్తాయ్. ఈ గ్రామంలోని చావడిలో 1961 గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు భూమిపూజ చేశారు. అలా చేస్తున్న సమయంలో ఆ గ్రామంలోని ఓ వ్యక్తికి కొడుకు పుట్టాడు. భూమిపూజ చేస్తున్న సమయంలో బాబు పట్టడంతో గ్రామస్థులంతా సంతోషించారు. ఇది శుభ పరిణామంగా భావించిన గ్రామస్థులు అనాటి నుంచి ఊళ్లో ఏ శుభకార్యం అంటే ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ చేసుకున్నా... ఫస్ట్ గాంధీజీ విగ్రహానికి పూల మాల వేసి కొబ్బరికాయ కొట్టాల్సిందే. అయితే భూమి పూజ రోజు పుట్టిన చిన్నారికి గ్రామస్థులంతా కలిసి మహాత్మాగాంధీ అని పేరు పెట్టారు. ఎక్కడా లేని విధంగా గాంధీజీని దైవంగా భావిస్తున్నారు నర్సింగ్ పూర్ గ్రామస్థులు. ఊళ్లో పెళ్లిళ్లైనా ... పేరంటాళ్లైనా... ఏ పండగైనా ... ఫస్ట్ గాంధీజీకి పూజలు చేస్తామని చెబుతున్నారు గ్రామస్థులు..
చూసేవారికి కాస్త ఆశ్చర్యం కలిగినా... నర్సింగ్ పూర్ గ్రామస్థులు అనాధిగా వస్తున్న ఆచారాన్ని మాత్రం తూచాతప్పకుండా పాటిస్తున్నారు. దేశవ్యాప్తంగా గాంధీ జయంతి రోజు మహాత్మున్ని అందరూ స్మరించుకుంటారు. కానీ ఈ గ్రామస్థులు మాత్రం నిత్యం ఈ మహాత్మునికి పూజలు నిర్వహించుకుంటున్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం అహర్నిశలు పోరాడిన గాంధీజీని నర్సింగ్ పూర్ గ్రామస్థులు దైవంతో సమానంగా ఆరాధిస్తారు.