Woman Constable Fell Down From CM KCR Convoy: తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. సీఎం కేసీఆర్ కాన్వాయ్ జనగామ జిల్లాలో వెళ్తుండగా.. కాన్వాయ్ నుంచి ఓ మహిళా కానిస్టేబుల్ జారిపడి రోడ్డుమీద పడిపోయారు. కొంచెం దూరం వెల్లగానే అందులో ఉన్నవారు అలర్ట్ చేయడంతో వాహనం ఆగింది. తోటి పోలీసులు వచ్చి మహిళా కానిస్టేబుల్ కు సహాయం చేసే ప్రయత్నం చేయగా, మహిళా కానిస్టేబుల్‌ స్వయంగా లేచి వెళ్లి మళ్లీ కాన్వాయ్ ఎక్కారు. ఈ ఘటనలో మహిళా కానిస్టేబుల్ కు స్వల్పంగా గాయాలయ్యాయి. 


సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం.. అంతలోనే అపశృతి


ములుగు రోడ్డులో నిర్మిం‌చిన ప్రతిమ క్యాన్సర్‌ ఇన్‌‌స్టి‌ట్యూ‌ట్‌ను ఇవాళ సీఎం కేసీఆర్ ప్రారం‌భిం‌చాల్సి ఉంది. అనంతరం హాస్పిటల్ ప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సభలో పాల్గొంటారు. నేటి ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన సీఎం కేసీఆర్ జనగామ జిల్లా, పెంబర్తి కళాతోరణం చేరుకున్నారు. ఇక్కడ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, స్థానిక నేతలు సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం కేసీఆర్ కాన్వాయ్ అక్కడి నుంచి కదిలింది.. అంతలోనే ఓ మహిళా కానిస్టేబుల్‌ సీఎం కాన్వాయ్ నుంచి జారి పడిపోయారు. స్వల్పంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.


హనుమకొండ జిల్లా దామెర క్రాస్‌రోడ్డు, జాతీయ రహదారి-163లో ప్రతిమ రిలీఫ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, ప్రతిమ మెడికల్‌ కాలేజ్‌, ఆస్పత్రి ఏర్పాటైంది. వీటిని ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ ఇక్కడికి విచ్చేశారు. సీఎం కేసీఆర్ ఇక్కడ దాదాపు మూడు గంటల పాటు గడుపుతారు. లంచ్ అనంతరం 2 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు బయలేరతారని అధికారులు తెలిపారు. సీఎం  కేసీఆర్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇదివరకే పరిశీలించారు. 



నేతల ముందస్తు అరెస్టులు
శనివారం వరంగల్ లో  సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా పోలీసులు ముందుగానే అప్రమత్తం అయ్యారు. మహబూబాబాద్ జిల్లా నారాయణపురం గ్రామస్తులు, ప్రజాప్రతినిధుల్ని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. తమ ఊరి పేరు ధరణి పోర్టల్ లో లేదని స్థానికులు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ను ఉద్దేశపూర్వకంగా అడ్డుకునే అవకాశం ఉందని భావించిన పోలీసులు సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీ తో పాటు కొందరు రైతుల్ని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.


ప్రతిమ మెడికల్‌ కాలేజీ, హాస్పిటల్ ప్రారంభం
వరంగల్ జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తున్నారు. శనివారం ఉదయం రోడ్డు మార్గంలో కేసీఆర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి మొదట జనగామ చేరుకున్నారు. అక్కడ మంత్రి ఎర్రబెల్లి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి సీఎం కేసీఆర్ కాన్వాయ్ (Telangana CM KCR Convoy) లో బయలుదేరి వరంగల్ చేరుకున్నారు. ములుగు రోడ్డులో నిర్మించిన ప్రతిమ మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌, క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. 350 పడకల సామర్థ్యంతో ప్రతిమ క్యాన్సర్ ఆస్పత్రిని నిర్మించారు. ఈ మెడికల్ కాలేజీ ద్వారా మెడికల్ స్టూడెంట్స్ కు ప్రతి ఏడాది 150 మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయని అధికారులు తెలిపారు.