Sudarshan Reddy On YCP Leaders: వైసీపీ నేతలపై ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావుపై వైఎస్సార్సీపీ జనరల్ సెక్రెటరీ సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ ఐటీ మంత్రి అమర్నాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. టీచర్ యూనియన్ సమావేశంలో మంత్రి  హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తగదన్నారు. ఆయన చెప్పింది ముమ్మాటికీ నిజం అన్నారు. అందులో  అవాస్తవాలు మాట్లాడిన సందర్భమే లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం 73% ఫిట్మెంట్ ఇస్తే, పక్క రాష్ట్రంలో 66% మించి ఇవ్వలేదని... కేంద్రం విధించిన షరతులకు తలొగ్గి మీటర్లు పెట్టి 7 వేల కోట్లు తీసుకున్నప్పటికీ ఫిట్మెంట్ ఇవ్వలేక పోయారు అని మంత్రి హరీష్ రావు చెప్పినట్లు గుర్తు చేశారు. ఇదంతా వాస్తవమేనని ఎమ్మెల్యే పెద్ది రెడ్డి వివరించారు.


కించపరిచేలా మాట్లాడారని చెప్పడం సరికాదు..


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ పథకాల పైన ప్రాజెక్టులపైన పలుమార్లు ఫిర్యాదు చేసిందని, విడిపోయి సీఎం కేసీఆర్ నాయకత్వంలో తాము బాగా అభివృద్ధి చెందుతున్నట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలాగే తమపైన ఈర్ష్య ఉండవచ్చని మేం పట్టించుకోవడం లేదని హరీష్ అన్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులను కించపరిచే విధంగా మంత్రి హరీష్ రావు మాట్లాడారని సజ్జల అనడం సరికాదన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణకు వ్యతిరేకులుగా ఉన్న వారిని, విషం కక్కిన వారినీ మాత్రమే వ్యతిరేకించామని... ఆ తర్వాత అందరం కలిసి పనిచేసి బ్రహ్మాండంగా ముందుకు వెళ్తున్నామని మంత్రి హరీష్ రావు చెప్పినట్లు తెలిపారు. మంత్రి హరీష్ రావు ఇతర రాష్ట్రాల వారిపై గాని, ప్రభుత్వ ఉద్యోగులపై గాని ఏనాడు తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. 


సహించలేకే దుష్ప్రచారం..


సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుంటే.. అది సహించలేకే వైసీపీ నేతలు ఇలా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే పెద్ది వివరించారు. తెలంగాణపై, టీఆర్ఎస్ నేతలపై అనవసరంగా దుష్ప్రచారం చేయడం  మొదలు పెట్టారని అన్నారు. ఉచిత కరెంటు పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్.. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను తుంగలో తొక్కారని విమర్శించారు. నాణ్యమైన కరెంటు ఇస్తామంటూ, మోటార్లకు మీటర్లు పెట్టి రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రచారం కొసం ఆంధ్రప్రదేశ్ నాయకులు తెలంగాణపై గాని, టిఆర్ఎస్ నాయకులపై గానీ, మంత్రి హరీష్ రావు గారిపై గాని అనవసరపు వ్యాఖ్యలు చేయవద్దని కోరుతున్నట్లు వివరించారు. 


8 ఏళ్లలో టీఆర్ఎస్ చేసిందేంలేదు: గుడివాడ అమర్ నాథ్


"హరీశ్ రావ, కేసీఆర్ మనిషేనా అంటూ ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తో  ఏదైనా గొడవ ఉంటే వాళ్లు వాళ్లూ చూసుకోవాలి. మా రాష్ట్రం సంగతి మీకు ఎందుకు. మా రాష్ట్రానికి నీతులు, సూచనలు టీఆర్ఎస్ చెప్పాల్సిన పనిలేదన్నారు. ఏపీ భవన్ లో ఉద్యోగులను బూటు కాలితో తన్నిన ఘటన మరిచిపోలేదని,  ఉద్యోగులను ఎవరు, ఎలా చూస్తారో ఆ ఘటనే నిదర్శన అన్నారు. 8 ఏళ్లుగా తెలంగాణలో టీఆర్ఎస్ చేసిందేం లేదని అమర్ నాథ్ వ్యాఖ్యానించడంతో వివాదం ముదిరింది.