PM Modi in Rajasthan Rally:
వేదికపైనే మోకరిల్లిన మోదీ..
ప్రధాని మోదీ సారీ చెప్పారు. వేదికపైనే ప్రజలందరి ముందు మోకరిల్లారు. రాజస్థాన్‌లోని అబూ రోడ్ ఏరియాలో ఓ ర్యాలీకి హాజరైన సమయంలో ఇది జరిగింది. "నేను ఇక్కడికి ఆలస్యంగా వచ్చాను. ఇప్పటికే రాత్రి 10 దాటింది. నిబంధనలు అనుసరించాలని నా మనస్సాక్షి చెబుతోంది. మీ అందరికీ క్షమాపణలు చెబుతున్నాను. నేను మరోసారి తప్పకుండా వస్తాను. మీ అందరి ప్రేమకు తగిన గౌరవం ఇచ్చే తీరతాను" అని ప్రధాని మోదీ అన్నారు. చివర్లో భారత్ మాతాకీ జై అని వేదికపైనే మోకరిల్లారు. అప్పటికే మోదీకి స్వాగతం పలుకుతూ అందరూ గట్టిగా నినాదాలు చేస్తున్నారు. సాధారణంగా...రాత్రి 10 దాటిన తరవాత మైక్రోఫోన్‌లు వినియోగించకూడదనే నిబంధన ఉంది. ఆ రూల్‌ని ఫాలో అవుతూ ప్రధాని మోదీ...ప్రసంగించకుండానే వెళ్లిపోయారు. వెళ్లిపోయే ముందు అందరికీ సారీ చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. భాజపా నేత అమిత్ మాల్వియా ఈ వీడియో షేర్ చేశారు. నవరాత్రుల సందర్భంగా ప్రధాని మోదీ శుక్రవారం ఉపవాసం చేస్తున్నారని అన్నారు. "
భాజపా నేతల ట్వీట్‌లు..
ప్రసంగించేందుకు సరైన సమయం కాదని ప్రధాని మోదీ తన స్పీచ్‌ను ఆపేశారు. ఆ రోజుకి అది ఏడో కార్యక్రమం. అంతకు ముందు వందేభారత్ ట్రైన్‌ను ప్రారంభించారు. అహ్మదాబాద్ మెట్రోలోనూ ప్రయాణించారు. ఆయనకు ఇప్పుడు 72 ఏళ్లు. అందులోనూ ఉపవాసంలో ఉన్నారు" అని ట్విటర్‌లో పేర్కొన్నారు అమిత్ మాల్వియా. మరో భాజపా లీడర్ డీకే అరుణ కూడా ఈ వీడియోపై స్పందించారు. ప్రధాని మోదీ అందరికీ ఆదర్శంగా నిలుస్తారని ప్రశంసించారు. "ఎంత గొప్ప వ్యక్తిత్వం. రాత్రి 10 దాటితే లౌడ్‌స్పీకర్లు వాడకూడదన్న నిబంధనను అనుసరిస్తూ ఆయన ప్రజలకు క్షమాపణలు చెప్పారు. మైక్ కూడా వినియోగించలేదు" అని ట్వీట్ చేశారు.