Srivari Garuda Seva: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 1వ తేదీ అంటే ఈరోజు జరగనున్న గరుడ సేవకు తిరులమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. దాదాపు మూడు లక్షల మంది భక్తులు శ్రీవారి గరుడ వాహన సేవ దర్శనం చేయించేందుకు చర్యలు చేపట్టింది. గ్యాలరీల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అన్న ప్రసాదాలు, తాగునీరు అందిస్తారు. అన్న ప్రసాద భవనంలో రాత్రి ఒంటిగంట వరకు అన్నప్రసాదం అందజేయనున్నారు. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా గ్యాలరీలకు అనుసంధానంగా తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. అదనపు సిబ్బందితో మెరుగైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. అలాగే గ్యాలరీల్లో వేచి ఉండే భక్తుల కోసం సురక్షిత తాగునీటిని టీటీడీ అందుబాటులో ఉంచింది. భక్తులు గ్లాసుల ద్వారా నీటిని అందిస్తారు. అలాగే భక్తులు తాగునీటిని తమవద్ద ఉంచుకోవాలనుకుంటే టప్పర్ వేర్ బాటిళ్లు గానీ, స్టీల్ లేదా రాగి సీసాలు గాని వెంట తెచ్చుకోవాలని సూచించారు.

  


హెల్ప్ డెస్కులు, కామన్ కమాండ్ సెంటర్ ఏర్పాటు..


తిరుమలలో గరుడ సేవ సందర్భంగా భక్తులకు కావాల్సిన సమాచారాన్ని అందించేందుకు ఏడు ప్రాంతాల్లో హెల్స్ డెస్కులు ఏర్పాటు చేశారు. జీఎస్టీ టోల్ గేట్, సీఆర్వో, బాలాజీ బస్టాండ్, రాంభగీచా విశ్రాంతి గృహాలు, రాగిమాను సెంటర్, ఏటీసీ సర్కిల్, బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేశారు. పీఏసీ-4 లో ఏర్పాటు చేసిన కమాన్ కమాండ్ సెంటర్ లో భక్తులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలను నివృత్తి చేస్తారు. ఇందుకోసం టోల్ ఫ్రీ నంబర్ 10800425111111 అందుబాటులో ఉంచారు. భక్తులు సులువుగా మాడ వీధుల్లోని గ్యాలరీల్లోకి ప్రవేశించేందుకు వీలుగా సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. వీటిలో ప్రవేశ, నిష్క్రమణ గేట్ల వివరాలను అందుబాటులో ఉంచారు. 
చైల్డ్ ట్యాగులు.. టీటీడీ భద్రతా విభాగం, పోలీసు విభాగం ఆధ్వర్యంలో పిల్లలకు చైల్డ్ ట్యాగ్ లు కడుతున్నారు. రద్దీ సమయంలో తల్లిదండ్రుల నుంచి పిల్లలు తప్పిపోతే ఈ ట్యాగ్ ల సాయంతో గుర్తించే అవకాశం ఉంది. 


ఆర్టీసీ ప్రత్యేక సేవలు.. 


తిరుమల శ్రీవారి గరుడ సేవకు భక్తులకు సేవలు అందించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు నిర్వహించే గరుడ సేవను తలకించేందుకు నిమిషానికి రెండు ఆర్టీసీ సర్వీసులను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చూసింది. ఎలక్ట్రిక్ బస్సులతో కలిపి తిరుమల ఘాట్ రోడ్డులో 5044 ట్రిప్పులతో 2 లక్షల మంది భక్తుల రాకపోకల టార్గెట్ గా ఆర్టీసీ సిద్ధం అయింది. ఈ మేరకు తిరుపతిలో 13 చోట్ల టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేసింది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 1వ తేదీన శనివారం గరుడ సేవ సందర్భంగా కొండ మీదకు ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదని టీటీడీ పేర్కొంది. భక్తుల భద్రత దృష్ట్యా ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి అక్టోబర్ 2వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు తిరుమల ఙాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదు.