Rains in Telangana AP: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తూర్పు మధ్య బంగాళాఖాతం నుంచి కోస్తా, రాయలసీమ మీదుగా కర్ణాటక వరకు మరొక ద్రోణి విస్తరించిందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రభావంతో ఈ సీజన్ చివరిసారి పలు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో శుక్రవారం పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. అక్టోబర్ 2 వరకు ఏపీ, తెలంగాణ, యానాంలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు తెలిపాయి. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలో మోస్తరు వర్ష సూచనతో ఎల్లో జారీ చేసింది ఐఎండీ.
తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. అక్టోబర్ 2 వరకు వర్ష సూచన ఉందని, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. శుక్రవారం పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నేడు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు వాతావరణశాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేశారు.
మరికొన్ని గంటల్లో నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు సైతం హైదరాబాద్ ను మేఘాలు కమ్మేశాయి. నగరంలో నేడు సైతం కొన్ని ప్రాంతాలకు వర్ష సూచన ఉంది. వర్షం పడని ప్రాంతాల్లో మధ్యాహ్నానికి ఉక్కపోత అధికం అవుతుంది. గంటకు 8 నుంచి 12 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఏపీలో మరో 2 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దిగువ ట్రోపో వాతావరణంలో వాయువ్య దిశ నుంచి ఏపీ, యానాంలో గాలులు వీస్తున్నాయి. అమరావతి వాతావరణ కేంద్రం సూచన ప్రకారం.. ఈ ప్రాంతాల్లో అక్టోబర్ 2 వరకు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలుపుతూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, పార్వతీపురం మణ్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, కాకినాడ, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లా, యానాంలోనూ మోస్తరు వర్షం కురవనుంది. ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షాలు ఉన్నాయి. ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచనున్నాయి.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
ఈ ప్రాంతాల్లో మరో 48 గంటలు మోస్తరు వర్షపాతం నమోదు కానుంది. అక్టోబర్ 2 వరకు ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ వెదర్ మ్యాన్, అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేశాయి. వర్ష సూచనతో ఈ ప్రాంతాలకు ఎల్లో వార్నింగ్ జారీ అయింది. పిడుగులు పడే ఛాన్స్ ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ముఖ్యంగా రాయలసీమలోనూ భారీ వర్షాలున్నాయి. కర్నూలు, నంద్యాల, కడప, అనంతపురం, తిరుపతి జిల్లాలతో పాటు అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో మోస్తరు వర్షాలున్నాయి. ఒకట్రెండు చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్ష సూచన ఉంది. నీళ్లు నిలిచి ఉంటే చోట జాగ్రత్తగా ఉండాలని, నీటి ప్రవాహాన్ని దాటి వెళ్లే ప్రయత్నాలు చేయకూడదని ప్రజలను అధికారులు హెచ్చరించారు.