అంతరిక్ష చరిత్రలో తొలిసారిగా ఓ పరిశీలన
ఒకే టార్గెట్ పై పనిచేస్తున్న జేమ్స్ వెబ్, హబుల్
డైమోర్ఫోస్ ఆస్ట్రరాయిడ్ పై దృష్టి పెట్టిన టెలిస్కోపులు
డార్ట్ స్పేస్ క్రాఫ్ట్ ఢీకొన్న తర్వాతి ఫలితాలపై దృష్టి
కొన్ని రోజుల కిందట సానా డార్ట్ ప్రయోగం చేసి విజయం సాధించింది. డైమోర్ఫస్ అనే ఆస్ట్రరాయిడ్ ను డార్ట్ స్పేస్ క్రాఫ్ట్ బలంగా ఢీకొట్టింది. ఆస్టరాయిడ్ కక్ష్యను మార్చటమే లక్ష్యంగా జరిగిన ఈ ప్రయోగం ఎంతవరకూ సక్సెస్ అయ్యిందో తెలియాలంటే స్పేస్ టెలిస్కోపుల ఫలితాలు బయటకు రావాలి. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర అంశాన్ని నాసా బయటపెట్టింది. అదేంటంటే డైమోర్ఫస్ ను డార్ట్ స్పేస్ క్రాఫ్ట్ ను ఢీకొట్టే సమయంలో అతిపెద్ద స్పేస్ టెలిస్కోపులైన నాసా జేమ్స్ వెబ్, హబుల్ స్పేస్ టెలిస్కోప్ లు ఆ దృశ్యాలను క్యాప్చర్ చేశాయి.
జేమ్స్ వెబ్ - హబుల్ - ఓ మల్టీ స్టారర్ :
జేమ్స్ వెబ్ ప్రయోగించకముందు వరకూ హబుల్ టెలిస్కోపే మానవ చరిత్రలో ప్రయోగించిన అతిపెద్ద టెలిస్కోపు. విజిబుల్ లైట్ మీద పని చేసే ఈ టెలిస్కోపు ఇప్పటివరకూ విశ్వంలో సుదూర ప్రాంతాల్లోని ఎన్నో వేల గెలాక్సీలను, నక్షత్రాలను ఫొటోలు తీసింది. ఇప్పుడు జేమ్స్ వెబ్ ప్రయోగించిన తర్వాత హబుల్ ను మించిన దూరం, వేగంతో అంతరిక్షంలో జరిగే మార్పులను ఫోటోలు, వీడియోలు తీయగలుతున్నాం. ఇప్పుడు ఈ రెండు అతి పెద్ద స్పేస్ టెలిస్కోపులు కలిసి మొన్న జరిగిన డార్ట్ ప్రయోగాన్ని రికార్డ్ చేయటం అంటే అంతరిక్ష సినిమాలో మల్టీస్టారర్ చేయటం లాంటిదే.
Credits : Nasa Webb/Hubble/Twitter
7 మిలియన్ కిలోమీటర్ల టార్గెట్ :
డైమోర్ఫోస్ ఆస్ట్రాయిడ్ భూమి నుంచి 70 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ జరిగిన డార్ట్ ప్రయోగాన్ని ఢీకొనే వరకూ స్పేస్ క్రాఫ్ట్ కి అమర్చిన డ్రాకో కెమెరా లైవ్ ఇచ్చింది. కానీ ఆ తర్వాత ఏం జరిగింది. ఆస్ట్రరాయిడ్ కక్ష్యలో మార్పులు జరిగాయా. అసలు ఇంపాక్ట్ తీవ్రత ఎంత ఉంది. ఇవన్నీ తెలియాలంటే స్పేస్ టెలిస్కోపులు తప్పనిసరి. అందుకే ఏడు మిలియన్ మైళ్ల దూరంలో జరుగుతున్న ఈ మార్పులను గమనించే పనిని జేమ్స్ వెబ్, హబుల్ స్పేస్ టెలిస్కోపులకు అప్పగించింది నాసా. జేమ్స్ వెబ్ ఇన్ ఫ్రారెడ్ లైట్ లో, హబుల్ విజిబుల్ లైట్ లో అక్కడ ఇంపాక్ట్ తర్వాత ఏర్పడిన మార్పులను అధ్యయనం చేస్తున్నాయి. ఇంపాక్ట్ తీవ్రతను రికార్డు చేశాయి. ఈ ఫోటోల్లో కనిపిస్తున్నది అదే. నీలిరంగులో కనిపిస్తున్నది హబుల్ తీసిన ఇమేజెస్ అయితే...రెడ్ కలర్ లో కనిపిస్తున్నది జేమ్స్ వెబ్ తీసిన ఇన్ ఫ్రా రెడ్ ఇమేజెస్.
పరిశీలనల ఫలితమేంటీ..?
జేమ్స్ వెబ్ ఇంపాక్ట్ ఏర్పడుతున్న టైం లో ఐదుగంటల్లో పది ఫోటోలను తీసింది. హబుల్ మొత్తం 45 ఫోటోలను తీసింది. వీటి ద్వారా డైమోర్ఫోస్ ఆస్ట్రరాయిడ్ ఉపరితలం స్వభావం ఏంటో తెలుసుకోవచ్చు. స్పేస్ క్రాఫ్ట్ ఆస్ట్రరాయిడ్ ను ఢీకొట్టినప్పుడు ఎంత మెటిరీయల్ దాని వాతావరణంలోకి ఎగిరింది..ఎంత బలంగా ఢీకొట్టింది లాంటి వివరాలు తెలియనున్నాయి. ఢీకొట్టిన కారణంగా దాని వాతావరణంలోకి ఎగసిన ధూళి మేఘాలను అధ్యయనం చేయటం ద్వారా పార్టికల్ సైజ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరిగిందో కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు.
వీటిన్నంటినీ కలపటం ద్వారా ఆస్ట్రరాయిడ్ కక్ష్యలో వచ్చిన మార్పులను తెలుసుకోవచ్చు. ఫలితంగా భవిష్యత్తులో భూమి దిశగా దూసుకువచ్చే గ్రహశకలాలు, ఇతర ప్రమాదాల నుంచి కాపాడుకునేలా రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవటంలో ఇప్పుడు జేమ్స్ వెబ్, హబుల్ స్పేస్ టెలిస్కోప్ లు చేస్తున్న పరిశోధనలు దోహదం చేస్తాయి.