Murali Resignation: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖలో మౌలిక సదుపాయాల సలహాదారు ఎ.మురళి తన పదవికి రాజీనామా చేశారు. గత మూడేళ్లుగా ప్రభుత్వంలో పాఠశాల విద్యాశాఖలో మౌలిక సదుపాయాల సలహా దారుడిగా పనిచేస్తున్న ఆయన.. అయితే గత కొన్ని రోజులుగా  రాజీనామా చేస్తారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ తన పదవికి రాజీనామా చేశారు. సలహాదారుగా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ శుక్రవారం లేఖ రాశారు. తెలంగాణలో విద్య, వైద్యం పరిస్థితులు దారుణంగా ఉన్ననేపథ్యంలో తన సేవలు అక్కడ అవసరమని భావించి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్ద మూడేళ్లుగా పాఠశాల విద్యాశాఖలో మౌలిక సదుపాయాల సలహాదారుగా పనిచేయడం గొప్ప అనుభూతి కలిగించిందని చెప్పుకొచ్చారు. 


నాడు - నేడు కార్యక్రమాలకు వైఎస్ జగన్ ప్రాధాన్యత 
పాఠశాల విద్యాశాఖ, ముఖ్యంగా నాడు - నేడు వంటి వినూత్న కార్యక్రమాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని కొనియాడారు. విద్యార్థులకు ఇవ్వగలిగే గొప్ప ఆస్తి చదువు మాత్రమే అని చెప్తూ విద్యారంగానికి పెద్దపీట వేశారన్నారు. అయితే సొంత రాష్ట్రమైన తెలంగాణలో విద్య, వైద్యం పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయని ఈ పరిణామాలనేపథ్యంలో తన సేవలు అక్కడ వినియోగించేందుకు రాజీనామ చేసినట్లు ముఖ్యమంత్రికి రాసిన లేఖలో సలహాదారు ఎ.మురళి వెల్లడించారు.




లేఖలో ఏముందంటే..?


"గత మూడు సంవత్సరాలుగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో పాఠశాల విద్యలో ప్రభుత్వ సలహాదారుగా పని చేయడం సంతోషం మరియు గొప్ప అనుభూతి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.ఎస్.జగన్ రెడ్డి గారు, గౌరవ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ బి. రాజశేఖర్ ఐఏఎస్ గారు పాఠశాల విద్యకు ఇచ్చిన ప్రాధాన్యత ఇప్పటి వరకు ఈ దేశంలో ఎవరూ ఇచ్చి ఉండరు. గౌరవ శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు పాఠశాల విద్యకు ముఖ్యంగా నాడు-నేడుకు ఇచ్చిన ప్రాధాన్యత, పూర్తి స్వాతంత్రతకు ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇదే సమయంలో నా స్వరాష్ట్రం తెలంగాణలో పరిస్థితులు ముఖ్యమంగా విద్య, ఆరోగ్యం సంబంధించిన పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. అందుకే నా సేవలు పూర్తిగా తెలంగాణలో ఇవ్వడాికి నేను ఇక్కడ రాజీనామా చేయాల్సి పరిస్థితి వచ్చింది. దయచేసి నా రాజీనామాను ఆమోదించగలు. నేను 31.10.200 వరకు పని చేస్తాను. మరొక్కసారి నాకు ప్రభుత్వ సలహాదారు (మౌలిక సదుపాయాలు)గా నాడు - నేడు కార్యక్రమం బాధ్యతలు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, శ్రీ రాజశేఖర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను".