YSRCP Vs TRS :   ఆంధ్రప్రదేశ్‌లో అధికార, విపక్షాల మధ్య ఇటీవలి కాలంంలో విమర్శలే కాదు అంతకు మించి అన్నట్లుగా అసభ్యంగా విమర్శించుకుంటున్నారు. అదంతా కామన్. ఒకే రాష్ట్రంలో రాజకీయాలు చేస్తూంటారు కాబట్టి హద్దులు దాటిపోయినా సమరం వారి మధ్యే ఉంటుంది. పొరుగు రాష్ట్ర పార్టీలపై విమర్శలు చేయాల్సిన అవసరం లేదు.కానీ ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీకి తెలంగాణ రాష్ట్ర సమితిని కూడా టార్గెట్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. వైఎస్ఆర్‌సీపీ పాలనపై టీఆర్ఎస్ కీలక నేతలు చేస్తున్న కామెంట్లకు కౌంటర్ ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఆ ప్రభావం ఇప్పుడిప్పుడే కనిపిస్తోంది. టీఆర్ఎస్ నేతల కామెంట్లకు ఘాటుగా కౌంటర్ ఇవ్వడం ప్రారంభించారు. అయితే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ? రాజకీయంగా మిత్రులుగా ఉన్న టీఆర్ఎస్, వైఎస్ఆర్‌సీపీ మధ్య చెడిందా ?. ఈ పరిణామాలు ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతాయి ?


వైఎస్ఆర్‌సీపీ పాలనపై టీఆర్ఎస్ నేతల విమర్శలు !


వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ ఫలానా దారుణంగా ఉందంటూ టీడీపీ నేతలు విమర్శలు చేయడం సహజం. పొరుగు రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ అలాంటి  విమర్శలు చేయాల్సిన అవసరం లేదు. కానీ టీఆర్ఎస్ నేతలు.. కేసీఆర్ దగ్గర్నుంచి  పువ్వాడ అజయ్ వరకూ అనేక మంది ఏపీలో పాలనను గేలి చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. అక్కడ పాలనా వైఫల్యాలు ఎలా ఉన్నాయో.. వారితో పోలిస్తే తెలంగాణ ప్రజలు ఎంత బాగా జీవిస్తున్నారో చూడండని పోల్చి చూపిస్తున్నారు. మామూలుగా అయితే ఇలాంటి పోలికలు అవసరం లేకుండానే రాజకీయం చేయవచ్చు. కానీ టీఆర్ఎస్ నేతలు ఇటీవలి కాలంలో ఈ పద్దతినే పాలో అవుతున్నారు. పార్టీ ప్లీనరీలో నేరుగా కేసీఆరే విమర్శించారు. ఆ తర్వాత కేటీఆర్ దాదాపుగా పరువు తీసినంతపని చేశారు. హరీష్ రావు అయితే.. ప్రతీ సందర్భంలోనూ ఏపీతో పోలిక తెచ్చి తెలంగాణలో ఎంత మంచి పాలన ఉందో చెబుతున్నారు. 


వైఎస్ఆర్‌సీపీతో రాజకీయంగా టీఆర్ఎస్‌కు స్నేహమే !


చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి గత ఎన్నికలకు ముందు కేసీఆర్ నేరుగానే వైఎస్ఆర్‌సీపీకి నేరుగానే సపోర్ట్ చేశారు. అందులో రహస్యమేం లేదు. అందుకే గెలిచిన తర్వాత సీఎం జగన్ నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లి కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. ఆ తర్వాత కూడా భేటీలు జరిగాయి. అయితే గత రెండేళ్ల నుంచి బహిరంగంగా కేసీఆర్ - జగన్ మధ్య ఎలాంటి సమావేసాలు జరగలేదు. దీనికి కారణం ఓ సారి ప్రగతి భవన్‌లో జరిగిన సమావేశంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం జరగడమే. అప్పట్నుంచి ముఖాముఖి భేటీలు జరగలేదు.. అలాగని రెండు పార్టీల మధ్య స్నేహం చెడిపోలేదు. రాష్ట్ర అంశాలపై తగాదాలు పెట్టుకోవడం లేదు. కావాలంటే కేంద్రం వద్దకు వెళ్తున్నారు. రాజకీయంగా పరస్పర ప్రయోజనకరమైన విషయాలు ఉంటే అమలు చేసుకుంటున్నారు. అంటే రాజకీయంగా రెండు పార్టీల మధ్య సామరస్యం ఉన్నట్లే. అందుకే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఆ విమర్శలు హరీష్ రావు వ్యక్తిగతమైనవని చెప్పడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. టీఆర్ఎస్‌తో ఎలాంటి పంచాయతీ లేదంటున్నారు. కానీ ఒక్క హరీష్ రావు మాత్రమే ఏపీ పాలనపై విమర్శలు చేయడం లేదు. స్వయంగా కేసీఆర్ కూడా సందర్భం వచ్చినప్పుడు చేస్తున్నారు. 


ఏపీలో పాలన తమకు ప్లస్ అవుతుందని టీఆర్ఎస్ నమ్మకం ?


ఏపీ ప్రభుత్వ విధానాలు, అక్కడి  పాలన తమకు ప్లస్ అవుతుందని టీఆర్ఎస్ నేతల నమ్మకంగా కనిపిస్తోంది. ఏపీలో కరెంట్ సంక్షోభం ఉంది. తెలంగాణలో లేదు. అదే సమయంలో  రైతుల మోటార్లకు మీటర్లు పెడుతున్నారు. అలా పెట్టడం రైతుల మెడకు ఉరి తాడు వేయడమేనని టీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. బీజేపీపై పోరుకు అదో ఆయుధంగా చేసుకుంది. ఏపీ సర్కార్ మోటార్లకు మీటర్లు పెడుతూండటంతో దాన్నో అవకాశంగా మల్చుకుంది. అదే సమయంలో ఏపీలో మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు ఇతర వసతుల పరంగా వెనుకబడింది. ప్రాజెక్టుల నిర్మాణం ఆగిపోయింది. వీటిని పోలుస్తూ తమ రాష్ట్రం జరుగుతున్న వాటిని చూపి.. మెరుగైన పాలన అందిస్తున్నామని ప్రజల్ని మెప్పించే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణలో ఉద్యోగులుక మెరుగైన పీఆర్సీ ఇచ్చారు.  ఏపీలో పీఆర్సీ పేరుతో పెద్ద రచ్చే జరిగింది. ఉద్యోగులు రోడ్డెక్కడానికి చాలా సమస్యలు ఉన్నాయి. ఇలాంటివన్నీ ఆయా వర్గాలను ఆకట్టుకోవడానికి టీఆర్ఎస్ ఉపయోగించుకుంటోంది. 


కేసీఆర్‌తో కలిసి నడిచేందుకు ఆసక్తి చూపలేదని మైండ్ గేమా ?


కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారు. జగన్ తనతోనే వస్తారని ఆయన గట్టిగా నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఇప్పుడా నమ్మకం సడలింది. పరోక్షంగా అయినా బీజేపీతోనే వైఎస్ఆర్‌సీపీ సత్సంబంధాలు కోరుకుంటోంది.  బీజేపీకి యాంటీగా వెళ్లే పరిస్థితి లేదు. అందుకే తమ వెంట రాకపోతే తమ మద్దతు ఉండదన్న మైండ్ గేమ్ ప్రారంభించిందన్న అభిప్రాయం కూడా  వినిపిస్తోంది.  


కారణం  ఏదైనా టీఆర్ఎస్, వైఎస్ఆర్‌సీపీ మధ్య ఆల్ ఈజ్ నాట్ వెల్ అని స్పష్టమవుతోంది. ఇవి ఎటు దారి తీస్తాయన్నది ముందు ముందుజరిగే పరిణామాల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.